కేతేపల్లి, నవంబర్ 1: మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం లేనందున రైతులు తమ ధాన్యాన్ని సాధ్యమైనంత తొందరగా ఆరబెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మండల పరిధిలోని ఇనుపాముల పీఏసీఎస్, కొత్తపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేదని, తేమ శాతం పెంచి ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు రైతులు కలెక్టర్‌ను కోరారు. కొత్తపేట కొనుగోలు కేంద్రం వద్ద గల ప్రభుత్వ భూమిని మొత్తం సర్వే చేసి హద్దుబందులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీవో అశోక్‌రెడ్డి, డీపీఎం మోహన్‌రెడ్డి, తాసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, ఏపీఎం మల్లేశ్ తదితరులు ఉన్నారు.
ఆడబిడ్డలను కాపాడుకోవాలి
నల్లగొండ, నవంబర్ 1: ఆడబిడ్డను కాపాడుకోవటంతో పాటు జిల్లా వ్యాప్తంగా శిశు విక్రయాలు, బాల్యవివాహాలు, బాలికలపై లైంగిక దాడులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం తన ఛాంబర్లో ఆయా శాఖల అధికారులతో జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలపై సమీక్షించారు. ఆడబిడ్డల రక్షణ విషయంలో సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీవోలు ప్రధాన దృష్టి సారించాలన్నారు. బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థినులపై లైంగిక దాడులను అరికట్టాలన్నారు.
ఎక్కడైనా శిశు విక్రయాలు జరిగితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటికీ శిశు విక్రయాలు, బాలికలపై లైంగిక దాడులు జరగటం సిగ్గుచేటన్నారు. ఈ విషయాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. బేటీ బచావో..బేటీ పడావో కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని దేవరకొండ, పెద్దవూర, నేరేడుగొమ్ము, చందంపేట, అడవిదేవులపల్లి ప్రాంతాల్లో సీడీపీవోలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ శశికళ, డీటీడీవో చత్రునాయక్, వేణుగోపాల్‌రెడ్డి, డీఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.