- నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్
మిర్యాలగూడ, జూన్ 9 : దేశ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, రైతులు తప్పనిసరిగా వరి వేయాల్సి వస్తే తక్కువ కాల పరిమితి గల వరి వంగడాలను సాగు చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని రైతు వేదికలో డివిజన్ పరిధిలోని ఎరువుల దుకాణాల డీలర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎరువుల దుకాణాలలో నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అందించాలని, లైసెన్సులు లేకుండా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జూన్ మాసంలో కొద్దిపాటి వర్షాలు ఉంటాయని జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వర్షాలు లేకపోవడం వల్ల వరి సాగు చేసిన వారికి నీటి కొరతతో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు.
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు కంది, పెసర, ఆముదం, జొన్న వంటి పంటలు సాగు చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 37 వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, 28 వేల టన్నులు కాంప్లెక్స్ ఎరువులు, 3,200 టన్నులు డి ఏ పి ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రైతులకు ఎటువంటి సబ్సిడీ పథకాలు, యూరియా అందుబాటులో ఉండాలంటే ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏడిఏ కొనిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఏఓ ఋషేంద్రమణి, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, ఎరువుల డీలర్లు తెడ్ల జవహర్ బాబు, నామిరెడ్డి అశోక్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రామ్ రెడ్డి పాల్గొన్నారు.