సూర్యాపేట, అక్టోబర్ 4 : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దుతు ధర, బోనస్‌ను పొందాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి వానకాలం ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటలలో నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్న రకం కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మిన వారికి మద్దతు ధరకు తోడు రూ.500 బోనస్ అందుతుందని చెప్పారు.
జిల్లావ్యాప్తంగా 4,72,934 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 3,79,746 ఎకరాల్లో సన్న వడ్లు, 93,188 ఎకరాల్లో దొడ్డు రకం పండించారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 206 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 63, ఐకేపీ 129, మెప్మా 13 కేంద్రాలు ఉంటాయని చెప్పారు. మండల కమిటీలు నిర్ణయించిన చోట సన్న రకం, దొడ్డు రకం కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 15 నాటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు.
వడ్ల రకం పరిశీలనలో ఏమైనా అనుమానం ఉంటే పొట్టు తీసి మైక్రో మీటర్ ద్వారా పొడవు, వెడల్పు నిష్పత్తి 3 కన్నా తక్కువ ఉంటే దొడ్డు రకానికి చెందినవిగా, 3 కన్నా ఎక్కువ వస్తే సన్న రకానికి చెందినవని నిర్ణయించాలన్నారు. సన్న రకం బస్తాలకు ఎరువు రంగులో ఎస్, దొడ్డు రకం సంచులకు ఆకుపచ్చ రంగులో డీ అని గుర్తు పెట్టాలన్నారు. ప్రతి గన్నీ బ్యాగ్‌పై కొనుగోలు కేంద్రానికి సంబంధించిన వివరాలు ఉండాలని సూచించారు. డ్యామేజ్ ఉంటే తిరిగి జిల్లా కేంద్రానికి పంపాలన్నారు.
పంట పచ్చిగా ఉన్నప్పుడు వరి కోయడం వల్ల వడ్లు తాలుగా మారుతాయని, హార్వెస్టర్ల యజమానులతో మండల స్థాయి కమిటీలు సమావేశాలు నిర్వహించి ఎండిన తరువాత కోసేలా అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం తేమ శాతం 14 ఉంటేనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, అప్పుడే సన్న రకానికి రూ.500 బోనస్ వస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ అప్పారావు, డీఎస్ఓ రాజేశ్వరరావు, సివిల్ సప్లయ్ డీఎం టీఎన్ఎస్ ప్రసాద్, డీఓ శ్రీధర్‌రెడ్డి, డీసీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.