అర్వపల్లి, జూన్ 03 : తొలకరి ముందుగానే ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అర్వపల్లి మండల తాసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ మాట్లాడుతూ.. వానాకాలం ప్రారంభమై రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఎస్సారెస్పీ కాల్వల వెంట చెట్లు పెరిగిపోయి, తూములు కూలిపోయి, కాల్వలు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయని, వెంటనే మరమ్మతులు చేసి ముందుగానే రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలన్నారు.
సన్నాలకు బోనస్ ఇప్పటివరకు ఇవ్వలేదని, అలాగే లైసెన్స్ లేని వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సకాలంలో పంట రుణాలను బ్యాంకుల ద్వారా అందజేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటి వరకు రైతులు కొనుగోలు కేంద్రంలో అమ్మిన వడ్లకు డబ్బులు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రైతు కూలీ సంఘం నాయకుడు పగిడిమర్రి సోమయ్య, ధర్మాజీ, నరసయ్య, సంజీవ పాల్గొన్నారు.