నల్లగొండ, మే 17 : రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైనదని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. విత్తనం విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురి చేయవద్దని, పారదర్శకత పాటించాలని, ఒకవేళ రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు రైతులకు ఇచ్చే విత్తనాలను అవసరమైతే కంపసాగర్ వంటి వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో తనిఖీ చేయించుకోవాలని సూచించారు.
విత్తన డీలర్లు తప్పనిసరిగా షాపు ముందు ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలను ఫ్లెక్సీల ద్వారా వెల్లడించాలన్నారు. అలాగే నకిలీ విత్తనాలను, ఇతర ప్రాంతాల నుండి వచ్చి విత్తనాలను అమ్మేవారిని ప్రోత్సహించవద్దని, రైతులకు విత్తనాలను అందించడంలో ఒక డీలర్‌గా కాకుండా, సాటి మనిషిగా ప్రవర్తించాలన్నారు. కోరమండల్ ఎరువుల కంపెనీ సహకారంతో ఈ- పాస్ యంత్రాలు అందజేస్తున్నందున కోరమండల్ కంపెనీ టెక్నికల్ స్టాఫ్ ను పెంచాలని, ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే సమస్యను అధిగమించే విధంగా కృషి చేయాలని తెలిపారు. విత్తనాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించిన రెండో జిల్లాగా నల్లగొండ నిలిచిందన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, అనుబంధ శాఖలు, డీలర్ల సహకారంతోనే ఇది సాధ్యమైందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 5 లక్షల 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటికే 5 లక్షల 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు.
Nalgonda : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ.. వచ్చే వానకాలం జిల్లాల్లో 11 లక్షల ఎకరాలు సాగు అవుతుందని అంచనా వేయడం జరిగిందన్నారు. 5 లక్షల ఎకరాల్లో వరి, 5 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి పండించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అయితే వరితో పాటు, ఇతర పంటలను సాగు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ప్రత్యేకించి 20 వేల ఎకరాల్లో కంది సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని డీలర్లు సరైన, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని కోరారు. ఈ సీజన్ నుండి ఎరువులన్నింటిని ఈ పాస్ యంత్రం ద్వారా ఇవ్వడం జరుగుతుందని, కోరమండల్ ఫర్టిలైజర్ సహకారంతో జిల్లాలోని 973 మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కోరమండల్ ఎరువుల కంపెనీ సీజీఎం వెంకటేశ్వర్లు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, రామ్మూర్తి, రవి, రాజేందర్, హర్ష తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వంద మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు.
Nalgonda : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి