గుండాల, మే 29: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండాలలో ధాన్యానికి నిప్పు పెట్టి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. తూకం వేస్తున్న బస్తాలకు ట్రక్‌షీట్ ఇచ్చినా మిల్లర్లు అడ్డగోలుగా తరుగు పేరుతో రైతులకు తక్కువ చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఏసీఎస్ చైర్మన్ లింగాల భిక్షం, సీఈవో నాగయ్య అక్కడకు చేరుకొని రైతులను శాంతింపజేయడానికి ప్రత్నించారు. రైతు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కేంద్రానికి చెందిన మేకల చందుకు 382 బస్తాలకు ట్రక్‌షీట్ జారీ చేసినా రెండోసారి అదే ధాన్యానికి 372 బస్తాలుగా ట్రక్ షీట్ రాసిచ్చారని చెప్పారు. పది బస్తాలు తరుగు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడి రైతులకు మద్దతు పలికారు. మిల్లర్లు రైతులను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చేతకాని ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ అలంశెట్టి మహేశ్, రైతులు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్, మే 29: ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగూల శ్రీనివాస్ అన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండలంలోని కొలనుపాక సిద్దిపేట రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బెదరబొయిన యాకమ్మ వెంకటేశ్, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగ స్వామి, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మామిడాల భానుచందర్, వార్డు సభ్యులు తేరాల బాలశంకర్, బల్లెపు సంపత్, బీఆర్ఎస్ నాయకులు బెదరబొయిన శంకర్, చాడ సురేందర్‌రెడ్డి, గంధమల్ల రవి, మిట్టపల్లి పాండు, ఏదునూరి భాస్కర్ తదితరులున్నారు.