భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 18: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు యూరియా కొరతలేదని ప్రకటనలు గుప్పిస్తున్నా… క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల అవస్థలు వర్ణనా తీతంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా బుకింగ్ కోసం సెల్ పట్టుకొని యాప్ ఓపెన్ చేయగానే క్షణాల్లో స్టాక్ జీరో కనిపిస్తుంది. చదువు రాని వారు, సెల్ ఫోన్‌పై అవగాహన లేనివారు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద బుధవారం యూరియా కోసం రైతులు బారులుదీరారు. యూరియా ఇస్తున్నారని సమాచారం తెలుసుకొని చాలామంది రైతులు అకడికి చేరుకున్నారు. యాప్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే అని అనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం 444 బస్తాలు రాగా యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు యూరియాను పంపిణీ చేశారు.
మునగాల, ఫిబ్రవరి 18 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్‌లో యూరియా బుకింగ్ తెలియని రైతులు తమ పిల్లలను స్కూల్ బంద్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు సుంకర అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం యాప్ పనిచేయక యూరియా బుకింగ్ కాకపోవడంతో సూర్యాపేట జిల్లా మునగాల సొసైటీ వద్ద గోదాంకు తాళం వేసి రైతులు సొసైటీ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ..ప్రభుత్వం అనాలోచిత విధానం వల్ల రైతులకు యూరియా అందక పొలాలు ఎండిపోతుంటే కన్నీటి పర్యంతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం యూరియా యాప్‌ను రద్దు చేసి సొసైటీ వద్దే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు రమణారెడ్డి, హుస్సేన్, నర్సింహారావు, వెంకన్న నాగేశ్వరావు, రామయ్య పాల్గొన్నారు.
వేములపల్లి, ఫిబ్రవరి 18: యూరియా కోసం మండలంలోని శెట్టిపాలెం పీఏసీఎస్ వద్ద రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా బుకింగ్ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కట్టా మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ.. యూరియా దొరక్క సాగు చేసిన వరి పంట దెబ్బతింటుందని, రైతులు ఏడు రోజులుగా యూరియా బుకింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నా.. సెకండ్లలోనే అయిపోతుందని, ఏ సమయంలో యూరియా సమాచారం ఆన్లైన్లో ఉంచుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించి పాత పద్ధతిలోనే పీఏసీఎస్, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ షాపుల ద్వారా యూరియా అందించాలన్నారు. కార్యక్రమంలో మజ్జిగపు వెంకట్‌రెడ్డి, తంగెళ్ల సైదిరెడ్డి, నక్క శ్రీధర్, బొడ్డు ప్రసాద్, చంటి, వేణు, పకీరయ్య, కోల సైదులు, నక్క నాగరాజు, వెంకటయ్య, పెదమాం భరత్, జవ్వాజి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.