ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో భాగంగా భువనగిరి జిల్లాలో నోటీసుల పరంపర కొనసాగుతున్నది. ఓ వైపు అధికారులు నోటీసులు జారీ చేస్తుంటే.. మరోవైపు నిర్వాసితులైన రైతులు వాటిని తిరస్కరిస్తున్నారు. అంతటితో ఆగకుండా తిరిగి అధికారులకే నోటీసులు పంపిస్తున్నారు. తమకు సరైన ప్యాకేజీ ఇవ్వకుంటే భూమి ఇచ్చేది లేదంటూ కుండబద్దలు కొడుతున్నారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): అధికారులు మాత్రం 3ఈ నోటీసులు ఇచ్చి భూములు తీసుకుంటామని చెబుతున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్‌ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీని పరిధిలోకి తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి.
జిల్లాలో సుమారు 1775 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అయితే పరిహారం విషయంలో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోట్లు విలువ చేసే భూములు పోతున్నాయని, మంచి ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రూరల్ అయితే రిజిస్ట్రేషన్ విలువకు మూడు రెట్లు, మున్సిపాలిటీ అయితే రెండు రెట్లు పరిహారం చెల్లించాలని భావిస్తున్నది. దీనికి బాధిత రైతులు ఒప్పుకోవడంలేదు.
ఇటు నోటీసులు.. అటు లేఖలు..
జిల్లాలోని చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలో ట్రిపుల్ ఆర్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఇందులో భాగంగా ఇటీవల 250 మంది నిర్వాసితులకు ఆర్డీవో శేఖర్ రెడ్డి పేరుతో నోటీసులు జారీ చేశారు. కానీ కొందరు బాధితులు మాత్రం నోటీసులకు తీసుకోకుండా తిరస్కరించారు. అంతే కాకుండా కొందరు రైతులు ఆర్డీవోను స్వయంగా కలిసి లేఖలు అందించారు. “భూమి జీవనోపాధి ద్వారా జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ విలువైన 1.20 కోట్లు పరిహారం అందించండి. లేదంటే భూమికి భూమి ఇవ్వండి. సర్కారు ప్రకటించిన పరిహారం సరిపోవడంలేదు. కాబట్టి మా భూములు ఇవ్వడంలేదు.” అంటూ లేఖలు రాశారు.
త్వరలో 3ఈ నోటీసులు..!
ఇటీవల అధికారులు 3హెచ్ (2) నోటీసులను బాధి రైతులకు జారీ చేశారు. అవసరమైన ధృవ పత్రాలు తీసుకొని రావాలని అందులో పేర్కొన్నారు. కానీ కొందరు రైతులు వ్యతిరేకించడంతో అధికారులు త్వరలో 3ఈ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. నోటీసుల జారీ తర్వాత తొలుత బాధితుల భూమికి సంబంధించి ప్యాకేజీ డబ్బులు భూమిరాశి పోర్టల్‌లో జమ చేయనున్నారు. దీనికి ఎలాంటి వడ్డీ కూడా ఉండదు. ఆ తర్వాత భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
‘భువనగిరి’ అవార్డు పెండింగ్..
జిల్లాలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, వలిగొండ, చౌటుప్పల్‌కు సంబంధించి బాధితులకు అవార్డు ఇప్పటికే ఆమోదం పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సుమారు 130 ఎకరాలకు 20 కోట్లతో అవార్డు పాసైంది. అప్పటి నుంచి వడ్డీతో సహా పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ భువనగిరి పరిధిలో మాత్రం అవార్డు పెండింగ్‌లో ఉంది. ఇక్కడ గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడం, సర్వేకు రైతులు సహకరించకపోవడం, హైకోర్టును ఆశ్రయించడంతో అవార్డు ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు పరిహారంలో భూములు, ఇండ్లతోపాటు చెట్లు, చేమలకు కూడా డబ్బు చెల్లించనున్నారు.