పెన్పహాడ్, ఏప్రిల్ 21 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు దగా పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయంలో కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. యాసంగి ధాన్యం విక్రయించేందుకు నానాపాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తుకాలు సరిగ్గా జరగకపోగా.. వడ్లు బాగాలేవని, సంచులు దించుకోమని, మరోమారు తూర్పార పట్టాలంటూ కొర్రీలు పెడుతుండడంతో కర్షకులు లబోదిబోమంటున్నారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని అనంతారం, నారాయణగూడెం పీఏసీఎస్ కేంద్రాల్లో సుమారు 8,900 బస్తాలు కాంటాలు వేయగా 5,980 బస్తాలు లారీల ద్వారా చింతలపాలెం శివసుభ్రమణ్యేశ్వర మిల్లు, కోదాడలోని శ్రీ వెంకటలక్ష్మి మిల్లు, ఎఫ్సీఐకు రవాణా చేశారు. అలాగే అనాజీపురంలో 1,355 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటివరకు ఐదు లారీల ద్వారా ఇదే మిల్లులకు రవాణా చేశారు. ఇందులో రెండు లారీలు దిగుమతి కాలేదు. నేటికి వారం రోజులకు చేరుకుంది. లారీలు వస్తాయన్న ఆలోచనలో నిర్వాహకులు వేల బస్తాలు కాంటాలు వేయగా ట్రాన్స్పోర్టు కోసం ఎదురు చూస్తున్నాయి. కాంటాలు కాక ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా దర్శనం ఇస్తున్నాయి.
మరోపక్క వాతావరణ శాఖ వర్ష సూచనల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ధాన్యం రాశులు ఉన్నాయి. చినుకులు పడితే తడవకుండా ధాన్యాన్ని కాపాడుకోవడం ఎట్లా, అమ్ముకోవడం ఎట్లా అని రైతులు వాపోతున్నారు. సంచులు తూకం వేసుకునే వరకే తమ పని అన్నట్లుగా వ్యవహారం తయారైంది. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అనంతారం గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటింది. 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. 10 రోజులు ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన. ధాన్యం కాంటాలు వేసి మూడు రోజులు అవుతుంది. ఇప్పటి వరకు లారీలో లోడింగ్ కాలేదు. లారీలో బస్తాలు వేసేంత వరకు రైతుదే బాధ్యత అంటున్నారని అనంతారం గ్రామ రైతు గండికోట నాగయ్య వాపోయారు.