కోదాడ రూరల్, ఏప్రిల్ 08 : ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం దిగుబడులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా అధికారులు నేటికి కొనుగోళ్లు ప్రారంభించడం లేదన్నారు. అధికారుల చర్యలను నిరసిస్తూ మంగళవారం రైతులు నిరసన చేపట్టారు. కోదాడ రూరల్ మండల పరిధి తమ్మరలో హడావిడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు దుయ్యబట్టారు. కేవలం టెంట్ మాత్రమే వేసినట్లు, స్థానిక సిబ్బందికి రసీదు బుక్స్ ఇవ్వలేదని, నేచర్ మిషన్, గన్ని బస్తాలు, లెన్త్ కొలిచే సన్నాళ్ల మిషను, బ్లోయర్లు లేకుండా కొనుగోళ్లు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల ఆర్భాటం తప్పా ఆచరణ శూన్యమని విమర్శించారు. కొనుగోలు కేంద్రానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అనంతగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతుల ధర్నాను విరమింపజేశారు. ఈ ధర్నాలో సీపీఐ నాయకుడు బొల్లు ప్రసాద్, బీజేపీ నాయకుడు కనగాల నారాయణరావు, రైతులు నన్నేసాహెబ్, జల్లా జనార్దన్, మల్లబోయిన వెంకటేశ్బాబు, పుల్లయ్య చౌదరి, సామినేని సుబ్బారావు పాల్గొన్నారు.