కట్టంగూర్, ఏప్రిల్ 23 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో తేడా వచ్చిందని బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో మూడు కంప్యూటర్ కాంటాలు ఉండగా అందులోని ఒక కాంటాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం బస్తా 40 కేజీల 700 గ్రాముల ఉండాల్సి ఉండగా అదే బస్తాను గ్రామంలోని మరో కంప్యూటర్ కాంటాలో తూకం వేయగా 41 కేజీల 500 గ్రాములుగా చూపించింది. దాంతో రైతులు కొనుగోలు కేంద్రంలో ఆందోళన చేపట్టారు.
క్వింటాలుకు రెండున్నర కేజీల వరకు అదనంగా తూకం వేయడంతో తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జరిగిన మోసంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సీసీ శంకర్ కొనుగోలు కేంద్రానికి వచ్చి కాంటా వెయిట్ సరి చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. నిరసన కార్యక్రమంలో గుడుగుంట్ల వెంకన్న, తవిటి నాగార్జున, బీసం లింగయ్య, నార్ల సత్యనారాయణ, నిమ్మనగోటి వెంకన్న, బెల్లి శేఖర్ పాల్గొన్నారు.