చౌటుప్పల్, సెప్టెంబర్ 12 : రీజనల్ రింగ్‌రోడ్డులో భూముల సేకరణపై బాధిత రైతులు మరోసారి భగ్గుమన్నారు. రెండు ఏండ్ల నుంచి ఉత్తర భాగం రైతులు జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను కూడా ముట్టడించారు. అన్ని పార్టీల పెద్దలను కలిశారు. ఢిల్లీ దాకా వెళ్లి నిరసన తెలిపారు. ఈ ఉద్యమం అప్పటి నుంచి అగ్గి రాజుకుంటూ వస్తోంది. దీనికితోడు దక్షిణభాగం అలైన్మెంట్ వివరాలను ఇటీవల విడుదల చేశారు. ఈ రెండు ప్రాంతాల రైతులు తోడవ్వడంతో పోరాటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు.
హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు జిల్లాలోని ఉత్తరభాగంలో ఉన్న తుర్కపల్లి, యాదగిరి గుట్ట, భువనగిరి, వలిగొండ చౌటుప్పల్, దక్షణ భాగంలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ, చండూరు మండలాలకు సంబంధించిన గ్రామాల పేర్లను ప్రకటించింది. తదితర మండలాల్లోని గ్రామాల్లో వస్తున్న భూముల సర్వే నెంబర్లు వెబ్సైట్లో పొందుపర్చింది. ఈ నెల 15లోగా భూములు కోల్పోతున్న వారు తమ అభ్యంతరాలు తెలియచేయాలని కోరింది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత చివరి నోటిఫికేషన్ ప్రకటిస్తామని హెచ్ఎండీఏ ప్రకటించింది.
ఈ క్రమంలో ఈ నెల 8న హైదరాబాద్‌లోని మెట్రో డెవెలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కార్యాలయాన్ని ఆయా గ్రామాల రైతులు ముట్టడించారు. మెరుపు దాడి కూడా చేశారు. అలైన్మెంట్ మార్చాలని లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాజాగా శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చౌటుప్పల్, సంస్థ్ధాన్నారాయణపురం, వలిగొండ తదితర మండలాల్లోని వివిధ గ్రామాల్లో భూములు కోల్పోతున్న వందలాది రైతులు అక్కడకు 10 గంటలకు చేరుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి బారీకేడ్లు కూడా ఏర్పాటు చేశారు. వాటిని లెక్క చేయకుండా ధర్నా వద్దకు తరలి వచ్చారు.
రెండున్నర గంటలపాటు ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఉద్రిక్తతల మధ్య ధర్నా కొనసాగింది. దీనికి బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. పెద్దల కోసం అలైన్మెంట్ మార్చి పేద కుటుంబాలను పొట్టగొడుతున్నారని పలువురు రైతులు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలైనా వదులుకుంటాం… భూములు ఇవ్వబోమని నినాదాలు చేశారు. తమ పొట్టగొట్టే ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక పరిశ్రమ కోసం అలైన్‌మెంట్‌ను 40 కిలో మీటర్ల నుంచి 28 కిలో మీటర్లకు కుదించారని ధ్వజమెత్తారు. కాం గ్రెస్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం అలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఇంటికి వెళ్తే కనీసం రైతులకు సమయం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో శేఖర్‌రెడ్డికి అలైన్ మెంట్ మార్చాలని వినతి పత్రం సమర్పించారు.
ఆర్డీవో కార్యాలయం నుంచి రైతులు ర్యాలీగా స్థానిక బస్‌స్టాండ్ వరకు బయలుదేరారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా పోలీసులు పసిగట్టారు. రైతులు రోడ్డు ఎక్కేందుకు విశ్వప్రయత్నం చేస్తుండగా పోలీసులు బారీకేడ్లు, తాళ్ల సహాయంతో వారిని రోడ్డు ఎక్కకుండా అడ్డుకున్నారు. అయి నా కొందరు వెళ్లారు. జాతీయ ర హదారిపై బైఠాయిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రహదారిపై ట్రాఫిక్ స్థంభించిం ది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. రాస్తారోకో చేసేందు కు వెళ్తున్న రైతులను పో లీసులు ఆదుపులోకి తీసుకొని డీసీఎంలో ఎక్కించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతరాములు, సీపీఐ జాతీయ సభ్యుడు పల్లె వెంకట్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి, భూనిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి, వివిధ పార్టీల బాధ్యులు గిర్కటి నిరంజన్ గౌడ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, బూర్గు కృష్ణారెడ్డి, దూడల భిక్షంగౌడ్, పల్లె శేఖర్‌రెడ్డి, భూనిర్వాసితులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలో వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ 60 కిలో మీటర్లు అలైన్మెంట్ మారుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఓట్లు వేసిన తర్వాత ఆ హామీ ఎక్కడకు పాయో. పెద్ద కంపెనీల యాజమాన్యాల మేత కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. అలైన్మెంట్ మార్చేందుకు సీఎంకు ప్రతిపాదన పెట్టారా. తక్షణమే అలైన్‌మెంట్‌ను మార్చాలి.
-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
ట్రిపుల్ఆర్ భూనిర్వాసితులకు న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. పాలకపక్షంలో మరోలా వ్వవహరించడం సరైందికాదు. కంపెనీల కోసం రైతుల పొట్టగొట్టే ఆలోచన మానుకోవాలి. భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలి.
-ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు పెద్దల కోసం వంకర టింకర తిరుగుతున్నది. పేదల భూములు లాక్కుంటూ పెద్దలకు లాభం తెచ్చే విధంగా ఉంది. కంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ రైతులపై ఉండాలి. అభివృద్ధి కోసం భూములు తీసుకున్నా.. రైతులకు ఎంత సహాయం చేసినా తక్కువే. భూమికి బదులు భూమి ఇవ్వాలి.
-మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
ట్రిపుల్ఆర్ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కేంద్రానికి, సేకరణకు ఎలాంటి సంబంధం లేదు. భూనిర్వాసితులకు బహిరంగ మార్కెట్ కన్నా మూడు రెట్లు పరిహాం ఇవ్వాలి. ఈ ప్రాజెక్టుపై కోమటిరెడ్డి బ్రదర్శ్ డ్రామాలు బంద్ పెట్టాలి. ఇద్దరు అన్నదమ్ములు తలోమాట చెప్పడం సరికాదు.
-బీజేపీ రాష్ట్ర నాయకుడు గంగిడి మనోహర్‌రెడ్డి