తిప్పర్తి, మార్చి 28 : అధికారులు ఎట్లాంటి కొర్రీలు పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ అధికారులు తాలు పేరుతో కొర్రీలు పెడుతున్నారని, లేదంటే తూకంలో కోత విధించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.
ఆరుగాలం కష్టించి పంటను పండిస్తే అధికారులు వివిధ రకాల సాకులు చెబుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఎట్లాంటి కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వచ్చి సర్ది చెప్పడంతో రైతులు రాస్తారోకోను విరమించారు.