మునుగోడు, డిసెంబర్ 3 : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు సీసీఐ తీరుతో ఆందోళన చెందుతున్నారు. మునుగోడు మండ లం కొంపెల్లి గ్రామంలో గల జేబీ పత్తి మిల్లు యాజమాన్యం తేమ సాకుతో ఒక్కొక్క ట్రాక్టర్కు సుమారుగా 80నుంచి 200 కిలోల వరుకు తరుగు తీస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పత్తిని కొనుగోలు చేయకుండా తిరిగి పంపిస్తున్నారు.
ఈ క్రమంలో రైతులు మంగళవారం మిల్లు వద్ద ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, వ్యవసాయ అధికారులు అక్కడికి వచ్చి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 8శాతం తేమ ఉన్న ఏ గ్రేడ్ పత్తి క్వింటాలుకు రూ.7,521 ధర నిర్ణయించిందన్నారు. 9నుంచి 12శాతం వరుకు తేమ ఉంటే ఒక్కొక్క శాతానికి రూ.75 తక్కువగా కొనుగోలు చేయాలని నిర్ణయించిందని చెప్పా రు.
ధాన్యం మాదిరిగా పత్తి ఆరబెట్టుకునే పరిస్థితి ఉండదని, సీసీఐ లేదంటే ప్రైవేటుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ఎలక్ట్రానిక్ కాంటాల వినియోగంలో వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జేబీ పత్తి మిల్లులో సీసీఐ అధికారులు, మిల్లు యాజమాన్యం, మధ్య దళారులు కలిసి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. తేమ సాకుతో కోత విధించిన పత్తిని రశీదులో చూపకుండా తరుగును తీసేసి రశీదు ఇస్తున్నారని తెలిపారు.