రుణమాఫీ రాని రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉండగా, ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెట్టి మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. వ్యవసాయ అవసరాలకు రెండు లక్షలకుపైన రుణం తీసుకున్న వాళ్లు 2లక్షలకు పైన ఉన్న డబ్బును తిరిగి చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని తిరకాసు పెట్టడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. పైనగదును చెల్లించేందుకు చేతిలో డబ్బు లేక మిత్తికి తెచ్చుకుంటున్నారు. తీసుకున్న అప్పు మాఫీ చేయించుకునేందుకు కొత్త అప్పు చేయాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు విడుతలుగా రుణమాఫీ చేస్తున్నది. జిల్లాలో తొలి విడుతలో 36,483 మంది, రెండో విడుతలో 17,991మంది, మూడో విడుతలో 13,011మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించింది. వారిలో దాదాపు 30శాతం మందికి పైగా రుణమాఫీ కాలేదు. ఇందుకు అధికారులు మాత్రం అనేక కారణాలు చెబుతున్నారు. జాబితాల్లో పేర్లు ఉన్నా ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కాలేదు. ఇక మూడో విడుతలో రూ. 1.50 లక్షల నుంచి రూ. 2లక్షల వరకు మాఫీ చేయాలి. ప్రభుత్వం మాత్రం రూ. రెండు లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేస్తామని కొర్రీ పెట్టింది. అంతకంటే ఎక్కువ ఉన్న వారికి మాఫీ చేయబోమని స్పష్టం చేసింది. అయితే పైన అమౌంట్‌ను రైతులే చెల్లించాలని తిరకాసు పెట్టింది. సదరు మొత్తాన్ని చెల్లించాకే ప్రభుత్వం చెప్పిన రూ. రెండు లక్షలు మాఫీ చేస్తామంటున్నది. దీంతో జిల్లాలో వేలాది మందికి రుణమాఫీ కాలేదు. అయితే ప్రభుత్వం పైన డబ్బులు వదిలేసి మిగతా అమౌంట్‌ను మాఫీ చేయొచ్చని వాదనలు కూడా ఉన్నాయి. సర్కారు ఉద్దేశపూర్వకంగా తిరకాసు పెట్టి.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆత్మకూర్.ఎం : రుణమాఫీ వివరాలను తెలుసుకునేందుకు రైతులు రోజూ బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగలేక తిప్పలు పడుతున్నారు. ఆత్మకూరు(ఎం)లోని గ్రామీణ వికాస బ్యాంక్‌లో పంట రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ కోసం శుక్రవారం వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. బ్యాంకు అధికారులు మాత్రం టోకెన్ సిస్టం పెట్టి రోజూ 30నుంచి 40 మంది రైతులకే అనుమతి ఇస్తున్నారు. దాంతో మిగతా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండు లక్షలకు పైన అమౌంట్ కడితేనే మాఫీ చేస్తామని సర్కారు తేల్చడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పెట్టుబడి కోసం తంటాలు పడుతున్నారు. మరోవైపు రైతు భరోసా కింద ఎకరానికి రూ. ఏడున్నర వేలు కూడా ప్రభుత్వం జమ చేయలేదు. దీంతో మాఫీకి అర్హత పొందేందుకు రైతులు బయటకు అప్పులు చేస్తున్నారు. ప్రైవేట్‌లో రెండు, మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో మిగిలిన అమౌంట్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇలా రూ. 20వేల నుంచి రూ. లక్ష వరకు బయట బాకీలకు తెస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం నిర్వహించింది. డిసెంబర్ 7న అధికారం చేపడుతామని, 9న రుణమాఫీ చేస్తామని, అందరూ రుణాలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక 9వ తేదీన రుణమాఫీ చేయలేదు. ఆఖరికి ఏడు నెలల తర్వాత రుణమాఫీకి చర్యలు తీసుకుంది. ఈ ఏడు నెలల్లో రైతుల రుణాలకు వడ్డీ పెరుగుతూనే వస్తున్నది. అప్పుడే మాఫీ చేస్తే మిత్తీ కట్టాల్సిన అవసరం ఉండకపోయేది. అంతే కాకుండా అనేక మంది రైతులు అసలు, వడ్డీతో కలిపి ఇప్పుడు రెండు లక్షలు దాటింది. దీంతో పైన డబ్బులు కడితేనే మాఫీ చేస్తామనడంతో మాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కాని వారి కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. మండలాల్లో వ్యవసాయ అధికారులకు రైతుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,074 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 45 నో డేటా ఫౌండ్, 89 పట్టాదారు పాసు పుస్తకాలు, 16 బ్యాంక్, 144 పేర్లు కలువకపోవడం, 11 ఆధార్ కార్డు, 42 డెబిట్, 308 కుటుంబ, ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందాయి.
ప్రభుత్వం రూ. 2లక్షల పైగా క్రాప్‌లోన్ ఉన్నోళ్లకు రుణమాఫీ చేయలేదు. నా పేరు, నా భార్య పేరుపై రెండు లక్షల 5వేల రుణం ఉన్నది. దానికి వడ్డీ 20వేలు కాగా మొత్తం 2లక్షల 25 వేలు అయ్యింది. మూడో జాబితాలో మా పేర్లు రాకపోవడంతో వ్యవసాయాధికారులను సంప్రదించాం. 2లక్షల పైన ఉన్న డబ్బులను చెల్లిస్తే రుణ మాఫీ అవుతుందని చెప్పారు. బ్యాంకు వెళ్లి 28వేలు చెల్లించిన. ఇప్పుడు లక్షా 97వేల రుణం ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇప్పుడన్నా అవుతదో, కాదో. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తున్నది. కొర్రీలు పెట్టకుండా రుణమాఫీ చేయాలి.
-బుగ్గ నాగరాజు, రైతు, మోటకొండూర్
ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్నది. కొర్రీలు పెట్టి అందరికీ ఇవ్వడం లేదు. అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా చేయడం లేదు. నేను చందుపట్ల పీఏసీఎస్‌లో 1,28 లక్షల రుణం తీసుకున్నా. కానీ నాకు రుణమాఫీ కాలే. అధికారులు, బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాన్నా.
– గొర్ల వైకుంఠం, రైతు, ఎర్రంబల్లి, భువనగిరి మండలం
నాకు మూడు ఎకరాల భూమి ఉంది . మూడు సంవత్సరాల క్రితం పోచంపల్లి ఏపీజీవీబీ బ్యాంకులో రెండు లక్షల రూపాయల క్రాప్ లోన్ తీసుకున్న. 33 వేల రూపాయలు వడ్డీ అయ్యింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. జాబితాలో నా పేరు రాలేదు. రెండు లక్షలకు పైగా ఉంటే రుణమాఫీ కాదట. అప్పు తెచ్చి రూ. 33 వేలు బ్యాంకులో కట్టాను. రుణమాఫీ పేరిట నిబంధనల పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నది. బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అర్హులందరికీ రుణమాఫీ చేయాలి.
– ఆకుల రామచంద్రం, మెహర్ నగర్, భూదాన్ పోచంపల్లి