ఒక రైతు శ్రీకారంతో మారిన ఆలోచన గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ పరిధిలో 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ గ్రామంలోని రైతులకు యాతవాకిళ్ల చెరువు ప్రధాన నీటి వనరుగా ఉండడంతో మండలంలో అన్ని గ్రామాల కన్నా ముందే అక్కడ వరి నాట్లు మొదలుపెడతారు. ఈ గ్రామంలో కూలీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అందరి రైతుల నార్లు ఒకేసారి ఎదుగడంతో ఒకేసారి నాటుకు వచ్చేవి. రైతులు నాటు వేయించుకునేందుకు కూలీల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఈ సమస్యను ఎలాగైనా అధిగమించాలన్న ఆలోచనతో మూడేండ్ల క్రితం గ్రామానికి చెందిన కొత్త వెంకటరెడ్డి అనే రైతు తనకున్న వ్యవసాయ భూమిలో ఒక ఎకరా భూమిలో తడిదుక్కిలో వెదజల్లాడు. దీని నుంచి 37 బస్తాల దిగుబడి రావడంతో గ్రామస్తుల ఆలోచనలన్నీ ఆ దిశగా మళ్లాయి.
గరిడేపల్లి, డిసెంబర్ 21 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులంతా ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. కాల్వ ద్వారా నీటిని విడుదల చేసిన వెంటనే రైతులంతా ఒకేసారి నారు పోసుకోవడంతో నారు ఒకేసారి నాటువేతకు వస్తుంది. ఇదే సమయంలో రైతులు కూలీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీనినే అదునుగా తీసుకున్న కూలీలు తమ కూలి రేట్లను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నారు. దీనికి తోడు రానురాను నాట్లు వేసే కూలీల సంఖ్య సైతం తగ్గుతుండడంతో రైతులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. అనేక రకాల నాటు వేసే మిషన్లు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో రైతులు వాటి వైపు మొగ్గు చూపడం లేదు.
పురాతన కాలం నాటి వెదజల్లే పద్ధతి అనుకూలంగా ఉండడంతో ప్రస్తుతం రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. మూడేండ్లుగా ఈ పద్ధతి బాగా వెలుగులోకి వస్తుడడంతో చాలా మంది రైతులు దీనికే మొగ్గు చూపుతున్నారు. గరిడేపల్లి మండలంలో వెదజల్లే పద్ధతి బాగా పెరిగింది.
ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ
సాధారణంగా ఎకరా పొలం నాటు వేయాలంటే కూలీలు రూ.3500-4000 వరకు తీసుకుంటారు. వెదజల్లితే ఎకరాకు కేవలం రూ. 400-500 ఖర్చు మాత్రమే అవుతుంది. అదీ వెదజల్లే వారికి ఇచ్చే కూలి. ఇక రైతే స్వయంగా జల్లుకుంటే ఆ ఖర్చు కూడా ఉండదు. దిగుబడులు ఎకరాకు 35 -40 బస్తాలు వస్తున్నాయి.
గరిడేపల్లి మండలంలో 70 శాతం ఇదే విధానం
గరిడేపల్లి మండలంలో 39,694 ఎకరాల సాగు భూమి ఉండగా ఈ యాసంగిలో సుమారు 70 శాతానికి పైనే వెదజల్లారు. గానుగుబండ, కొండాయిగూడెం, పొనుగోడు, రామచంద్రాపురం, గరిడేపల్లి, కల్మల్చెర్వు, కీతవారిగూడెంలో ఈ పద్ధతికే ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు కొందరు రైతులు డ్రమ్సీడర్తోనూ విత్తుతున్నారు.
ఇరవై ఎకరాల్లో వెదజల్లిన
ఇరవై ఎకరాల వ్యవసాయ భూమిలో వరి విత్తనాలను వెదజల్లా. గతంలో నాటు వేయాలంటే 20 నుంచి 25 రోజులపాటు కూలీల చుట్టూ తిరిగితేగానీ నాటు పడేదికాదు. అది కూడా ఎక్కువ రేటు ఇస్తేనే పూర్తయ్యేది. ఈ బాధలన్నీ పడలేక వెదజల్లే పద్ధతిని పాటిస్తున్నా. గత సీజన్లో ఎకరాకు 40 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. దాంతో ఈ సారి కూడా వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేశా. గింజలు బాగానే మొలిచాయి. 15 రోజులు దాటింది. ప్రస్తుతానికి నా పంట బాగానే ఉంది. మా గ్రామంలోని రైతులంతా వెదజల్లే పద్ధతిని పాటిస్తున్నారు.
– మద్దా భాస్కర్, రైతు, కొండాయిగూడెం
ఖర్చు తక్కువ
గతంలో నాటు వేయాలంటే కూలీల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ వెదజల్లే పద్ధతిలో ఎవరి అవసరం లేకుండా మనమే ట్రాక్టర్‌తో దమ్ము చేసుకుని కరిగట్టు చేసి నేరుగా విత్తనాలు జల్లుకోవచ్చు. సాధారణంగా కూలీలు నాటు వేస్తే ఎకరాకు రూ.4000 అవుతుంది. కానీ ఈ పద్ధతిలో ఆ ఖర్చు లేదు. ఎప్పుడంటే అప్పుడు పొలాన్ని దమ్ము చేసుకుని విత్తనాలు జల్లుకోవచ్చు. అనుకున్న సమయానికి విత్తనాలు వేసుకోవచ్చు. ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా పెద్దగా పట్టదు.
– వై.అంజయ్య, రైతు, కీతవారిగూడెం
వెదజల్లడమే రైతుకు మేలు
వెదజల్లడం రైతుకు చాలా తేలికైన పని. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే వరి విత్తనాలను జల్లుకోవచ్చు. అన్ని విధానాల్లోకెల్లా ఇదే ఉత్తమమైనది. మంచి అనుభవం ఉన్న వ్యక్తితో జల్లిస్తే మడిలో సమానంగా వరి విత్తనాలు పడి ఎక్కువ పిలకలు పెడుతుంది. వెదజల్లిన దగ్గరి నుంచి ఎరువులు, మందులు కావాల్సిన మోతాదులో సరైన సమయంలో అందిస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి