నకిరేకల్, మే 1 : అందరికీ అన్నం పెట్టే రైతులకు గుక్కెడు మంచి నీళ్లు కరువయ్యాయి.. అదీ ప్రభుత్వ కార్యాలయంలో! ఎండన పడి వచ్చాం.. గొంతు తడుపుకొనేందుకు గిన్ని నీళ్లియ్యండి అని ప్రాధేయపడితే… మాకే నీళ్లు లేవు.. మీకెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలంటూ దురుసు సమాధానం ఎదురవుతున్నది. మంచి నీళ్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు.. ఎవరికి చెప్పుకొంటారో చెప్పుకోండంటున్నారని రైతులు వాపోతున్నారు.
నకిరేకల్ చుట్టుపక్కల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులు అకౌంట్ వివరాలు ఇచ్చేందుకు గురువారం స్థానిక మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చారు. విపరీతమైన ఎండ ఉండడంతో దాహం వేసిన రైతులు గొంతు తడుపుకొందామంటే కార్యాలయంలోని కుండలో నీళ్లు లేవు. రైతులు తాగేందుకు కొన్ని నీళ్లు ఇయ్యండని సిబ్బందిని అడిగితే దురుసుగా బదులిచ్చారు. ‘ఇక్కడ నీళ్లు లేవు.. ఏమీ లేవు. బయట షాపులు ఉన్నాయి. వాటర్ బాటిల్ కొనుక్కోపోండి. మీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండి’ అంటూ సీరియస్ అయ్యారు. దాంతో చేసేది లేక కొందరు బయటకు వెళ్లి తాగి వచ్చారు.
ఈ కార్యాలయానికి నిత్యం వందమందికిపైగా రైతులు వచ్చిపోతుంటారు. ప్రభుత్వ కార్యాలయంలో కనీసం నీళ్లు పెట్టరా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నుంచి నీళ్లకు బిల్లు ఇవ్వడం లేదని సిబ్బంది చెప్తున్నారు. ఈ విషయమై ఇన్చార్జి ఏడీఏ, ఏఓ ఎండీ జానీమియాను వివరణ కోరగా.. ‘ప్రభుత్వం నుంచి వ్యవసాయాధికారి కార్యాలయానికి నీళ్లకు గానీ, కరెంటుకు గానీ ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మండల కార్యాలయానికి అటెండర్ కూడా లేరు. ఏడీఏ కార్యాలయానికి ఉన్న ఇద్దరు అటెండర్లలో ఒకరిని ఏఓ కార్యాలయానికి వాడుతున్నాం. సిబ్బందికే నీళ్లు లేవు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన వారిని మందలిస్తాం’ అని చెప్పుకొచ్చారు.
గొంతు ఎండిపోతుందన్నా నీళ్లు ఇయ్యలే
మార్కెట్లో అమ్మిన వడ్ల డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుందామని వ్యవసాయ కార్యాయానికి వచ్చిన. సెంటర్ల ఆటో దిగి ఆఫీసుకు నడుచుకుంటూ వచ్చేసరికి గొంతు ఎండిపోయింది. ఆఫీసుల ఉన్న కుండలో నీళ్లు లేవు. నీళ్లు ఇయ్యమని అక్కడున్న మేడమ్లు, సార్లను అడిగితే నీళ్లు లేవు.. ఏం లేవు. బయట షాపు ఉంది కొనుక్కొచ్చుకోపో అని ఒకరన్నరు. నీళ్లు లేవు.. ఊరికే వొర్లించకు.. ఎక్కువ మాట్లాడకు.. దిక్కు ఉన్న చోట చెప్పుకో పో అని ఇంకొకలు అడ్డగోలుగా మాట్లాడిండ్రు. సెంటర్లో ఉన్న చలివేంద్రానికి పోయి తాగివచ్చిన.
-విజయమ్మ, రైతు, చందంపల్లి, నకిరేకల్ మండలం