డిండి, మే14 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదని, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. డిండి మండలంలోని టి.గౌరారం, తవక్లాపూర్, డిండి, గోనబోయినపల్లి గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంలో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయడంలో, ధాన్యాన్ని తరలించడంలో, అమ్మిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తరుగు పేరిట బస్తాకు మూడు కేజీల వడ్లు కట్ చేస్తున్నారని, వెంటనే ఈ విధానాన్ని ఆపాలని కోరారు. దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టం తీర్చడానికి ముఖ్య మంత్రికి సమయం లేక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శ్రద్ధ తీసుకొని గన్నీ బ్యాగులు సరిపడా సరఫరా చేయాలని, తగినన్ని లారీలని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రావు, జనార్దన్‌రావు, రాఘవాచారి, గొడుగు వెంకటయ్య, శీమర్ల మల్లయ్య, రవీందర్రావు, కృష్ణయ్య, వెంకట్రా మ్, గిరమోని శ్రీను, పెద్దులు, చంద్రయ్య, జయం త్, సురేశ్, తండు శ్రీను, బాసిత్, పీర్ మహ్మద్, ఐలేశ్చారి, రేణయ్య, రషీద్ పాల్గొన్నారు.