రామన్నపేట, మే 30: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా గ్రామాల్లో నేటికీ సగానికి పైగా ధాన్యం కాంటాలు కాక కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. దీంతో రైతులు.. ప్రభుత్వం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రోడ్డుపై పెట్టి మంట పెట్టి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆవేదనతో కంట కన్నీరు పెట్టుకుటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పదించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. దుబ్బాకలో రైతులు మార్కెట్కు ధాన్యం తెచ్చి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ 17 లారీల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. పెండింగ్లో ఉన్న 40 లారీల ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దయింది. దీంతో నాలుగు సార్లు ఆరపోసి అవస్థలు పడుతున్న తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ధాన్యపు సంచులను రోడ్డుపైకి తెచ్చి మంట పెట్టి కన్నీటి పర్యంతమయ్యారు. లారీలను తగిన సంఖ్యలో పంపడం లేదని ఎక్కువ తూకం వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం పలుమార్లు తడవడంతో ఇప్పటికే నాలుగు సార్లు ఆర బెట్టాల్సి వచ్చిందని, దీంతో అదనపు భారం పడుతున్నదన్నారు.
కడుపు మండుతోంది..
ధాన్యాన్ని మార్కెట్కు తెచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా సగానికి పైగా ధాన్యం మిగిలే ఉంది. దీంతో మా కడుపు మండుతోంది. వర్షాలు పడుతుంటే భయమేస్తోంది. ఇప్పటికే వర్షాలకు రెండు సార్లు ధాన్యం ఆరబెట్టిన. రెండు కిలోలు ఎక్కువ తూకం వేస్తూ మిల్లుల వద్ద తరుగు పేరుతో మరోసారి కటింగ్ చేస్తున్నరు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పదించడం లేదు. ఇప్పటికైనా లారీల సంఖ్య పెంచి వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయాలి.
బైరోజు ధనుంజయాచారి కొనుగోళ్ల జాప్యంతో రాస్తారోకో
రాజాపేట, మే 30 : ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాజాపేట మండలం నమిలేలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడం, కాంటాల ప్రక్రియ ఆలస్యం కావడం, తరుగు పేరుతో ఇబ్బందులు పెట్టడం వంటి సమస్యలపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో రైతులు నమిలే క్రాస్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నినాదాలతో ఈ ప్రాంతమంతా మార్మోగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నామన్నారు. అకాల వర్షాల భయంతో రాత్రింబవళ్లు ధాన్యం కుప్పల వద్దే కాపలా కాస్తున్నామని, వర్షం వస్తే ధాన్యం తడిసి నాణ్యత దెబ్బతిని భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం, లారీలు, గన్నీ సంచుల కొరత కారణంగా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ధాన్యం తూకం వేసిన తర్వాత కూడా మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోందని, దీంతో కొత్తగా ధాన్యం తెచ్చే రైతుల ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాస్తారోకో కారణంగా కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసి, పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.