చందంపేట(దేవరకొండ), జనవరి 19 : రైతులకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 21న నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా జాప్యం చేస్తున్నదని విమర్శించారు.
డిసెంబర్ 3న రైతులకు రైతు భరోసా కింద రూ.7వేలు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనే గొప్ప ఆశయంతో మాజీ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం తీసుకొచ్చారని, కానీ కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని, రుణమాఫీ 70 శాతం మంది రైతులకు కూడా అమలు కాలేదని తెలిపారు. మహిళలకు నెలకు రూ.2వేలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతు మహాధర్నాకు జిల్లా నుంచి రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, రుణమాఫీ కాని రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, మాధవరం శ్రీనివాస్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, వల్లపురెడ్డి, రాజినేని వెంకటేశ్వర్రావు, చంద్రశేఖర్‌రెడ్డి, జర్పుల లోక్యనాయక్, శంకర్‌నాయక్, ముత్యపురావు, లింగారెడ్డి, నీలా రవికుమార్, ఉజ్జిని సాగర్‌రావు, జనార్దన్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ముక్కమల బాలయ్య, లక్ష్మిపతి, పల్లా లోహిత్‌రెడ్డి, మోహన్‌కృష్ణ, పల్స వెంకటయ్య, ఆరెకంటి రాములు, ఇలియాస్ పటేల్, వడ్త్య బాలు, నల్లగా సు సత్యనారాయణ, శ్రీను, సత్యం పాల్గొన్నారు.