ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతులు అధిక సంఖ్యలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకకు ఆసక్తి కనబరుస్తున్నారు. పంట పెరుగుదలకు ఖర్చులు తక్కువ ఉండటంతోపాటు దిగుబడి భారీగా ఉండి ఆదాయం అధికంగా ఉండటం , రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తుండటంతో అనేకమంది సాగుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే పలువురు రైతులు ఆయిల్‌పామ్ తోటలు సాగు చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ని ఆత్మకూరు(ఎం), తిరుమలగిరి, మండలాలతోపాటు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల, అడవిదేవుపల్లి మండలాల్లో బత్తాయి తోటలు తొలగించి వాటి స్థానంలో రైతులు ఆయిల్‌పామ్ తోటల సాగు వైపు మళ్లుతున్నారు. అంతర్ పంటలను సైతం పండించడానికి అవకాశం ఉన్నందున కొత్త రైతులు కూడా ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
తిరుమలగిరి : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వం సాగు నీరందించి రైతులను ఆదుకోవడంతో నెర్రెలు బారిన నేలలో సిరుల పండుతున్నాయి. ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో రైతులు ఇప్పుడు ఆయిల్‌పామ్ సాగువైపు దృషి సారించారు. మొదటి సారిగా నియోజకవర్గంలో 68 మంది రైతులు 417 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు చేశారు. తిరుమలగిరిలో 2021 డిసెంబర్లో మధుసూధన్‌రెడ్డి అనే రైతు 25 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయగా తోట బాగా పెరుగుతూ మిగిలిన రైతులు సాగు చేపట్టేందుకు ఆసక్తి కలిగించింది.
కోతులు, పశువుల బెడద ఉండదు..
ఆయిల్‌పామ్ తోటలను పశువులు, జంతువులు, కోతులు తినవు. దాంతో రైతులకు జంతువుల బెడద కూడా ఉండదు. రోగాలు ఉండవు. 3 ఏండ్లు పైబడిన తోటలకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరందించాలి. వేసవిలో 300 నుంచి 350 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది.
మొక్కలు నాటే విధానం.
12 నుంచి 14 నెలల వయసున్ను ఆయిల్‌పామ్ మొక్కలను నాటుకోవాలి. 9+9+9 మీటర్ల సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరానికి 57 మొక్కలను నాటుకోవచ్చు. 60+60+60 సెం.మి (పోడవు +వెడల్పు +లోతు) పరిమాణంలో గుంటలు తీసి నాటుటకు ముందు ఒక్కో గుంటలో 400 గ్రామల సింగిల్ సూపర్‌ఫాస్పేట్ లేదా 200 గ్రాముల డీఏపీ, 50 గ్రాముల ఫోరేట్ గుళికలు వేసి కలిపిన మట్టిలో నింపాలి. నాటిన వెంటనే పాదులు చేసి తగినంత నీరందించాలి. బిందు సేద్యం(డ్రిప్) విధానంలో ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువులు అందించటం ఉత్తమమైన పద్ధతి.
సాగు వివరాలు..
తుంగతుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఆయిల్‌పామ్ సాగును పరిశీలిస్తే తిరుమలగిరిలో నలుగురు రైతులు 40 ఎకరాలు, నాగారంలో 12 మంది 69 ఎకరాలు, జాజిరెడ్డిగూడెంలో 9 మంది 54 ఎకరాలు, తుంగతుర్తిలో 10 మంది 82 ఎకరాలు, నూతనకల్‌లో 13 మంది 66 ఎకరాలు, మద్దిరాలలో 20 మంది రైతులు 106 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం.
ఆయిల్‌పామ్ సాగులో పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఎకరానికి ఆరంభంలో రూ. 10 నుంచి రూ. 12 వేలు మాత్రమే ఖర్చవుతుంది. పంట దిగుబడి ఎకరానికి 10 నుంచి 15 టన్నుల వరకు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో టన్నుకు రూ 18 వేల మద్దతు ధర పలుకుతుంది. దిగుబడి బాగా ఉంటే ఎకరానికి ఏడాదికి రూ 1.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. తొలి మూడేండ్ల వరకు అంతరపంటలు వేసుకునే వెసులుబాటు ఉన్నది. రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా మొక్కలు నాటడం మొదలు పంట కొనుగోలు వరకు ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది.
25 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశా..
వరిసాగుకు స్వస్తి పలకాలని భావించాను. మార్కెట్లో డిమాండ్ ఉండి లాభాలు వచ్చే ఆయిల్‌పామ్ సాగు చేయాలని భావించి గత ఏడాది ఉద్యానవన అధికారుల సహకారంతో 25 ఎకరాల్లో రుచి సోయా కంపెనీ మొక్కలు ఏలూరు నుంచి తెచ్చి పెట్టాను. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. అనేక మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చూసి వివరాలు తెలుసుకుంటూ సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
మిర్యాలగూడ డివిజన్లో 120 ఎకరాల్లో సాగు
దామరచర్ల, నవంబర్ 29 : పంట మార్పిడిపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు. దామరచర్ల మండలంలో రైతులు గతంలో ఎక్కువగా బత్తాయి తోటలు సాగు చేయగా వాటిపై కొందరు నిరాసక్తి కనబరుస్తున్నారు. అనేక మంది బత్తాయి తోటలను తీసివేసి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు, వాటి మార్కెట్ సౌకర్యం కల్పిస్తుండటంతో రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లుతు న్నా. మిర్యాలగూడ డివిజన్లో ప్రధానంగా దామరచర్ల మండలంలో ఇప్పటికే 50 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను రైతులు సాగు చేస్తుండగా అదనంగా మరో 500 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారు. డివిజన్ పరిధిలో ఇప్పటికే 120 ఎకరాలు సాగుచేస్తుండగా మరో 700 ఎకరాల్లో సాగుకు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యంలో 50ఎకరాలు సాగు చేస్తున్నారు.
అంతర్ పంటల సాగు ఇలా
మండలంలో దామరచర్ల, బొత్తలపాలెం, వాడపల్లి పరిధిలో సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ తోటల్లో మొదటి మూడేండ్ల వరకు రైతులు అంతర్ పంటలను సాగు చేపట్టారు. మునగ, మినుము, కంది, పెసర, మిర్చి, కూరగాయల పంటలను సాగుచేస్తున్నారు. ఆయిల్‌పామ్ పంట చేతికంది వచ్చే మూడు, నాలుగేండ్ల వరకు అంతర్ పంటలను సాగు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ రాయితీలు
ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా పలు రాయితీలు అందిస్తున్నది. 20 రూపాయలకే మొక్కను అందిస్తూ అంతర్ పంటల సాగుకు, ఎరువులకు ఎకరానికి ఏడాదికి రూ. 4,200 చొప్పున నాలుగేండ్ల పాటు రూ. 16,800 అందిస్తున్నది. బిందు సేద్యం పథకం కింద అర్హులైన రైతులకు 80 నుంచి 100 శాతం వరకు రాయితీపై విలువైన డ్రిప్ పరికరాలను అందజేస్తున్నది.
ఆత్మకూరు (ఎం)మండలంలో..
ఆత్మకూరు(ఎం) : వరికి బదులుగా దీర్ఘకాలిక రాబడి కోసం రైతులు అయిల్‌పామ్ సాగుపై అసక్తి చూపుతున్నారు. మంచి నేలతో పాటు నీటి సౌకర్యం ఉన్న రైతులు అయిల్‌పామ్ సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ సంబంధిత అధికారుల వద్ద పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. మండలంలో తొలిసారిగా మోద్గుకుంటలో రైతు మల్లెపూల ఉపేందర్ 10, ఉప్పలపహడ్లో రైతు ఏనుగు దయాకర్‌రెడ్డి 14 ఎకరాల్లో అయిల్‌పామ్ తోటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచారు.
30 ఏండ్ల పాటు రాబడి
మొక్కలు నాటిన 3 నుంచి 30ఏండ్ల పాటు ఆదాయం వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. ఎకరం భూమిలో 50 ఆయిల్‌పామ్ మొక్కలు నాటవచ్చు. నర్సరీలో ప్రతి మొక్క పెరుగుదల కోసం రూ. 220 ఖర్చవుతుండగా ప్రభుత్వం రైతులకు కేవలం రూ. 20 చొప్పున అందజేస్తున్నది. అదేవిధంగా డ్రిప్ ఏర్పాటు కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీలకు 90శాతం, ఓసీలకు 80శాతం సబ్సీడీ అందజేస్తున్నది.
ప్రభుత్వమే రవాణ చార్జీల చెల్లింపు
పంట చేతికి వచ్చిన తర్వాత వ్యవసాయ క్షేత్రం నుంచి అయిల్‌పామ్ కంపెనీ వరకు గెలలు తరలించడానికి టన్నుకు రూ. 400 రవాణ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది.
పాలడుగు వద్ద నర్సరీ
అయిల్‌పామ్ మొక్కల పెంపకానికి మోత్కూర్ మండలం పాలడుగు వద్ద నర్సరీ ఏర్పాటు చేశారు. నర్సరీలో ప్రస్తుతం 4 లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని యాదాద్రి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేయనున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
అయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే మండలంలోని మోద్గుకుంట, ఉప్పలపహడ్ గ్రామాల్లో రైతులు అయిల్‌పామ్ సాగు చేశారు. మరో 250 ఎకరాల్లో కూడా సాగుకు రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
– జోత్స్న, క్లస్టర్ అధికారి
ఇతర పంటలతో పోలిస్తే అయిల్‌పామ్ సాగు బాగుంది
వరి, పత్తితో పాటు ఇతర పంటలతో పోలిస్తే అయిల్‌పామ్ సాగు బాగుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేందుకు ప్రభుత్వం సైతం రైతులను ప్రోత్సాహించడం హర్షణీయం. 10 ఎకరాల్లో అయిల్‌పామ్ సాగు చేయగా రూ. లక్షా 50 వేలు మాత్రమే ఖర్చయింది.
– మల్లెపూల ఉపేందర్, రైతు, మోద్గుకుంట, ఆత్మకూరు(ఎం)