మోతె, సెప్టెంబర్ 15 : యూరియా కోసం మోతె మండలంలోని మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అన్నదాతలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి నాట్లు వేసి రెండు నెలలు గడుస్తున్నా యూరియా దొరకడం లేదని అన్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నామని, యూరియా దొరక్కపోవడంతో దిగుబడి సక్రమంగా వచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
యూరియా ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి యూరియా కొరత ఎన్నడూ లేదన్నారు. మన గ్రోమోర్ సొసైటీల వద్ద రాత్రి నిద్ర లేకుండా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులకు యూరియా సరిపడా అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
వస్తదో రాదో తెలియదు..
చివ్వెంల,సెప్టెంబర్ 15 : మండలంలోని రైతులకు యూరియా కోసం ఎదురు చూపులు చూడక తప్పడం లేదు..వస్తదో రాదో తెలియని యూరియా కోసం అధికారులు సోమవారం బారులు తీరిన రైతుల పేర్లు రిజిస్టర్లలో నమోదు చేయించుకుంటున్న సంఘటన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం చోటు చేసుకుంది. శనివారం దిగుమతి చేసుకున్న యూరియా అదే రోజు పంపిణీ చేయలేదు. దీంతో సోమవారం యూరియా లోడు దిగుమతి అయితే కష్టాలు తీరుతాయనుకున్న రైతులకు సోమవారం సైతం మొండి చెయ్యే ఎదురైంది.
శనివారం దిగుమతి చేసుకున్న 200 బస్తాలు క్యూలో నిలబడిన సగం మంది రైతులకే అందక పోవడంతో ఆందోళనకు గురయ్యారు.పీఏసీఏస్లో పని చేస్తున్న ఓ ఉద్యోగి తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే రాత్రికి రాత్రి పేర్లు నమోదు చేసి వారికి వరకు మాత్రమే అందజేస్తున్నాడని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు ప్రస్తుతం ఇక్కడ ఉన్న రైతులు పేర్లు రాసుకొని రేపు ఇస్తామని చెప్పి, మళ్లీ పేర్లు రాసుకోవడంతో రైతులు అటూ ఇటు పరుగులు తీస్తూ గందర గోళానికి గురయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో లైన్లలో నిలబడలేక రైతులు తమ చెప్పులు, రాళ్లు లైన్లలో పెట్టారు.
యూరియా కోసం లైనులో పాసుబుక్కులు
రాజాపేట, సెప్టెంబర్ 15 : యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం ఉదయం ఆరు గంటలకే వచ్చిన రైతులు పాస్ పుస్తకాల జీరాక్స్ కాపీలను లైన్లో పెట్టి పడి గాపులు కాస్తున్నారు. ఆరు గంటల నిరీక్షణ అనంతరం మంగళవారం ఇస్తామంటూ టోకెన్లు జారీ చేశారు.
యూరియా కోసం గింత తిప్పలా..!
రాజాపేట, సెప్టెంబర్ 15 : అయ్యా మాది యాదాద్రి భువనగిరి జిల్లా బేగంపేట. నాకు ఎనిమిదెకరాల పొలం ఉంది. దాంట్లో కొంత వరి వేసిన. గత వారం దినాల కిందట బాయికాడికి పోతుంటే జారిపడి చెయ్యి ఇరిగింది. యూరియా చల్లక చేను ఎర్రబడింది. రాజాపేట బ్యాంకు కాడ ఏదో చిట్టీ రాసి ఇస్తే యూరియా బస్తా ఇస్తున్నరని చెప్పగా చెయ్యి బాగా నొప్పిగా ఉన్నా పొద్దునే లేచి పోయిన. ఆక్కడ ఏదో కాగితం రాపిచ్చి లైనులో పెట్టిన. అక్కడే నాలుగు గంటల సేపు కూసున్న.
ఆఫీసర్ సార్లు లైనులో పెట్టిన కాగితాలన్నీ తీసుక పొయిర్రు. మరో గంట తర్వాత లోపటికిపోతే ఒక చిట్టీ ఇచ్చిర్రు. ఆ చిట్టీ తీసుకొని మెల్లగా బయటికి వచ్చిన. యూరియా సంచీ ఏడ తీసుకోవాలని ఆడిగితే.. ఇప్పుడే ఇయ్యరే.. మళ్లా 22వ తారీఖున రా.. అప్పుడు ఒకటో రెండో ఇస్తరని అక్కడే ఉన్నాయన చెప్పిండు. చేతగాని ప్రాణానికి మస్తు తిక్కలేసింది. ఒక్క యూరియా బస్తా కోసం గింత తిప్పలాని బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాల్నో సమజ్ కాలే. నాకు గిప్పుడు 70 ఏండ్లు. గప్పటి నుంచి ఎవుసం జేస్తున్నా గానీ యూరియా సంచీ కోసం ఎప్పుడూ గిట్లాంటి తిప్పలు చూడలే.
అబ్బే.. యూరియా పక్కదారి పట్టలే..!
నీలగిరి, సెప్టెంబర్ 15 : మిర్యాలగూడ ఎమ్మెల్యే పేరు చెప్పి గన్‌మెన్ యూరియాను పక్కదారి పట్టించాడనడంలో ఏమాత్రం నిజం లేదని, సక్రమంగానే రైతులకు పంపిణీ జరిగిందని కేవలం వ్యవసాయాధికారుల సమన్వయ లోపమే కారణమని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి క్లీన్‌చీట్ ఇచ్చారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి ఎంపీ విలేకరల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ యూరియాను పక్కదారి పట్టించి బ్లాకులో విక్రయించారంటూ వస్తున్న అరోపణల్లో నిజం లేదని, జిల్లా కలెక్టర్, ఎస్పీ విచారణ కూడా పూర్తి చేశారన్నారు. ఎమ్మెల్యే అదేశాల మేరకే వేములపల్లి మండలం కుక్కడం గ్రామానికి యూరియా పంపిణీ చేశారన్నారు. యూరియా పంపిణీ సందర్భంగా అధికారుల మధ్య జరిగిన సమన్వయ లోపంవల్లే అరోపణలు వచ్చాయని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులు యూరియా దొరకదనే ఉద్దేశంతో ముందుగా కొనిపెట్టుకుంటున్నారే తప్ప యూరియా కొరత లేదన్నారు.