‘గోదారి.. గోదారి.. పారేటి గోదారి.. చుట్టూ నీళ్లు ఉన్నా చుక్క నీరు దొరకని ఏడారి ఈ భూమి.. తలాపున పారుతుంది గోదారి.. మన చేను.. మన చెలక ఎడారి’ అనే పాటలు మళ్లీ ఇప్పుడు పాడుకునే రోజులు వచ్చాయి. ఇది అక్షరాల నిజం. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా రాజాపేట మండలానికి సాగు జలాలు అందించాలని స్థానిక పాలకులు ప్రయత్నం చేస్తుండక పోవడంతో కరువుతో రైతన్నలు అల్లాడుతున్నారు. కాల్వలు ఉన్నా నీళ్లు రాక, చెరువులు వట్టిపోయి, బోర్లు ఎండిపోయి పంట పొలాలు ఎండిపోతున్నాయి. మళ్లీ వలసలు మొదలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజాపేట మండలానికి కాళేశ్వరం 15 ప్యాకేజీ ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపి సాగు జలాలు అందించాలని రైతు జేఏసీ ఆధ్వరంలో గత పదిరోజుల నుంచి నిరసనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. గోదావరి జలాలు అందిస్తే ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య తీరే అవకాశం ఉన్నది.
బ్రాంచ్ కెనాల్ కోసం రూ.12 కోట్లు మంజూరు
రాజాపేట మండలంలోని 11 గొలుసు కట్టు చెరువులు, 32 కుంటలను నింపి 35,131 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేయగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషితో రూ. 12 కోట్లు విడుదల చేశారు. మండలానికి తలాపున ఉన్న గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణ పూర్తి కాక ముందే కాళేశ్వరం ప్యాకేజీ 15లో భాగంగా 29 కిలో మీటర్ల పొడవున బ్రాచ్ కెనాల్ కాల్వ తవ్యకాల కోసం మండలంలో 157 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. సింగారంలో 40.10 ఎకరాల భూమిలో సర్వే నిర్వహించి రైతుల నుంచి భూ సేకరణ పూర్తి చేసి పరిహారం సైతం అందజేశారు. ఆరు దశాబ్దాల కరువు నేలకు సాగు జలాలు అందించాలనే గొప్ప సంకల్పంతో 5 కిలో మీటర్ల మేర కాల్వ తవ్వకాల పనులు కూడా కొనసాగాయి. ఇంకా కొద్ది మేర తవ్వితో కాల్వ పనులు పూర్తయ్యేవి. త్వరలో గోదావరి జలాలతో గొలుసు కట్టు చెరువులు జలకళ సంతరించుకొని కరువు నేల తడిసి మరో కోనసీమగా మారుతుందనే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులను ఆగం చేసింది. ఏదో మార్పు వస్తుందని కలలు కన్న రైతులకు సాగు నీటితోపాటు అన్ని విధాలుగా కష్టాలు తప్పడం లేదు.
అప్పుడే ఎండుతున్న పంటలు
రాజాపేట మండల వ్యాప్తంగా ఎలాం టి జల వనరులు లేవు. బోర్లు బావుల మీదనే ఆధార పడి వరి సాగు చేస్తారు. గతేడాది వర్షాలకు చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి యాసంగి 20 వేల పైగా ఎకరాలు వరి సాగు నోచుకుంది. ఈ యాసంగి చెరువులన్నీ నీళ్లు లేక వట్టి పోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గి పోయి బోర్లు, బావు లు ఎండిపోతున్నాయి. వరి సాగు సగానికి పైగా పడిపోయింది. సిరులు పండే భూములకు సాగు జలాలు లేక పడావు పడ్డాయి. యాసంగి వరినాట్లు ఒక వైపు కొనసాగుతున్న క్రమంలో మరో వైపు వేసిన వరి చేన్లు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. రెండు కార్లు రైతు భరోసా రాక, పూర్తిగా రుణమాఫీ కాక సావుకార్ల వద్ద అప్పుల చేసి సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. అన్నదాతలు అపర భగీరథుల్లా నీళ్ల కోసం జల్లెడ పడుతున్నారు. 1000 ఫీట్ల వరకు బోర్లు వేసినా దుమ్ము వస్తుందే తప్ప చుక్క నీరు బయటి రావడం లేదు. బోర్లు వేసి మళ్లీ రైతన్నలు అప్పుల పాలవుతున్నారు.
పశువులకు మేతగా పంటలు..
రాజాపేట మండలంలో ఇప్పటికే పంటలు ఎండిపోవడంతో రైతులు పశువులకు వదిలేస్తున్నారు. పాముకుంట శివారులో రాపోలు మధుసూదన్‌రెడ్డి, గొడుగు కొండయ్య, గొడుగు కిషన్, గుంటి బీరప్ప, కాకల్ల ఎల్లయ్య, కాకల్ల సత్తయ్య, చిక్క స్వామితో పాటు మరి కొంత మంది రైతుల 50 ఎకరాల వరి పొలాలు ఎండిపోయాయి. గత్యతరం లేక ఎండి పోయిన పంటను గొర్లు, పశువులకు మేపుతున్నారు.
చెరువులు నింపాలని నిరసనలు
చెరువులు వట్టి పోయి భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో కాంగ్రెస్ సర్కారుపై రైతన్నలు కన్నెర్ర చేస్తున్నారు. రాజాపేట మండలానికి కాళేశ్వరం 15 ప్యాకేజీ ద్వారా గొలుసు కట్టు చెరువులు నింపాలని జల సాధన కమిటీ ఏర్పాటైంది. గత పది రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నారు. సొంత నిధులతో కాళేశ్వరం 15 ప్యాకేజీ కాల్వ పనులు చేపడుతామని స్థానిక ఎమ్మెలే బీర్ల అయిలయ్య ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.