‘వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు.. 24 గంటలు అవసరం లేదు’ అన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతన్నలు మండి పడుతున్నారు. సోమవారం పలు రైతు వేదికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ‘కాంగ్రెస్ హయాంలో అరకొర కరెంట్‌తో అరిగోస పడ్డాం.. పొలానికి నీళ్లు పారక పంటలు ఎండిపోయేవి.. రైతుల బతుకులను ఆగం చేసేందుకు మళ్లీ కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతున్నది.. ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తాం’ అని హెచ్చరించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేటలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, అనుముల మండలం రామడుగు, నిడమనూరు, రేగులగడ్డలో ఎమ్మెల్యే నోముల భగత్, ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్, మునుగోడు మండలం
పులి పలుపులలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండప్రతినిధి, జూలై 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న మూడు పంటల బీఆర్ఎస్ పార్టీనే కావాలని అన్నదాతలు నినదించారు. రైతులను అప్పులపాలు చేసిన కాంగ్రెస్ వద్దని, రైతును రాజు చేసిన సీఎం కేసీఆర్ పాలనే కావాలని స్పష్టీకరించారు. రైతుల ఉసురు పోసుకుంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజకీయ సమాధి కాక తప్పదని ఆగ్రహించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని రైతు వేదికల వద్ద సమావేశాలు నిర్వహించారు. దీనికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉచిత విద్యుత్‌పై రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్‌కు మద్దతు తెలిపారు. వ్యవసాయ రంగానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తూర్పారబట్టారు. ‘ఎకరం ఒక గంటలో పారిస్తామని రేవంత్‌రెడ్డి చెప్తున్నడు. ఆయనే ఒక వ్యక్తిని పంపితే జీతానికి పెట్టుకుంటాం.
గంటలో ఎకరం పారించి చూపించాలి. కాంగ్రెస్ హయాంలో బోరులో పెండ నీళ్లు పోసి స్విచ్ ఆన్ చేయడానికి పోయేసరికే కరెంట్ పోయేది. కరెంట్‌తో గోస పడ్డాం. రోజంతా అర ఎకరం కూడా పారేది కాదు. కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్రలేక అవస్థలు పడ్డాం. కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్‌తో 3పంటలు పండిస్తున్నం. రైతులం సంతోషంగా కడుపునిండా తింటున్నాం. 24 గంటల ఉచిత కరెంట్ వద్దని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పేవరకు నిరసనలు ఆపం’. అని పలువురు రైతులు తమ అనుభవాలు చెప్పుకొన్నారు. అన్నదాత ఆనందంగా ఉండటం చూసి కాంగ్రెస్ ఓర్వలేక పోతున్నదని, అందుకే అడ్డగోలుగా వాగుతున్నదని మండిపడ్డారు. తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమావేశంలో తీర్మానించారు.
3గంటల కరెంట్ అయితే ఎవుసం బంద్ పెట్టాల్సిందే
మూడు గంటల కరెంటు ఇస్తే ఈ గాలికి అరెకరం కూడా పారదు. తెల్లారేసరికి పారింది ఆరిపోతది. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వింటే ఎపుసం బంద్ పెట్టి కూలికి పోవాల్సిందే. నాకు 5 ఎకరాలు ఉన్నది. 24 గంటల కరెంటు నడిస్తెనే మూడు ఎకరాలకు పైగా పడుతది. మిగతాది బర్రెల గడ్డికి వదిలిన. కొంత కూరగాయలు వేస్తున్నా. కరెంటు ఇరాం లేకుండా రావడంతో పొలం కాడ పని తక్కువైంది. ఇంతకుముందు పగలు, రాత్రి పొలం కాడనే పట్టేది. ఇప్పుడు అది లేదు గనుక కొంత కౌలుకు తీసుకొని పత్తి వేస్తున్న. అదే మూడు గంటల కరెంట్ వస్తే ఎవుసం చేసుడు దండుగ అయితది. ఎడ్లు, బర్రెలు అమ్మి అడ్డా కూలికి వెళ్లాల్సిందే. తెలంగాణ రాష్ట్రం రాక ముందు కరెంటు సక్కగ లేక, పెట్టుబడి అందక కొంత సాగు చేసి మిగిలిన టైంలో కంపెనీల్లో పనులకు పోయినం. ఇప్పుడు మంచిగా ఇంటి పట్టున ఉండి ఎవుసం చేసుకుంటున్న.
– అంతటి విష్ణు, తంగడపల్లి, చౌటుప్పల్ మండలం
రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్‌కు మింగుడు పడ్తలేదు
వ్యవసాయం సంతోషంగా చేసుకుంటూ బుక్కెడు బువ్వ తింటుంటే కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడ్తలేదు. నోటికాడికి వచ్చిన బువ్వను తన్నేందుకు చూస్తున్నది. 24 గంటల కరెంటు, రైతుబంధు, సాగునీరు ఇస్తుంటే 3గంటల కరెంటు చాలని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నడు. ఎవరెన్ని మాట్లాడినా మేం నమ్మం. ఎవరు కూడా నమ్మొద్దు. ఒకప్పుడు బాయికాడికి పోయి కరెంటు వచ్చేదాకా ఎదురుచూస్తుండె. 3గంటల కరెంటు కూడా సక్కగ ఇయ్యక పారిన సగం మడి కూడా ఎండిపోతుండె. ఇప్పుడు ఎప్పుడు పోయి మోటర్ ఆన్ చేసినా నీళ్లొస్తున్నయి. రైతులకు సీఎం కేసీఆర్ అన్నీ ఇచ్చిండు. ఆయన ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– గడ్డం యాదిరెడ్డి, రైతు, గూడూరు, బీబీనగర్ మండలం
మూడు గంటలంటే పుట్టి మునిగినట్లే..
నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు ఏడు గంటల కరెంట్ పొద్దున, రాత్రి ఇస్తే పొలం సరిగ్గా పారకపోయేది. ఇప్పుడు మూడు గంటలు ఎట్ల సరిపోతది. కాంగ్రెస్ పాలనలో రైతు పడ్డ కష్టం పగోనికి కూడా రావద్దు. ఎరువులు దొరక్కపోయేది. నీళ్ల కరువు. కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకపోయేది. పొలానికి నీళ్లు పెట్టేందుకు పనులన్నీ మానుకొని రాత్రి, పగలు పడిగాపులు కాసేది. ఎండకాలంలో రైతుల బాధలు వర్ణనాతీతం. ఆ రోజులు తలుచుకుంటే వణుకు పుడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం చాలా అభివృద్ధి చెందింది. పుష్కలంగా నీళ్లు, 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు, ఎరువుల తిప్పలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంతో వ్యవసాయం పండుగలా మారింది. మళ్లీ రేవంత్‌రెడ్డి మూడు గంటలు చాలు, 24 గంటల కరెంట్ ఎందుకని దిక్కుమాలిన మాటలు మాట్లాడటం సరికాదు. మూడు గంటల కరెంట్‌తో రైతు పుట్టి మునుగుడు ఖాయం. రైతుల కష్టాలను తీర్చిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవున్ని ప్రార్థిస్తున్నా.
– నేనావత్ శంకర్‌నాయక్, రైతు, గుడితండా, కొండమల్లేపల్లి మండలం
కాంగ్రెస్సోళ్లు గాలి మాటలు మాట్లాడొద్దు
నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. తొమ్మిదేండ్ల కింద కరెంట్ సరిగా రాక మోటర్ పెట్టేందుకు పొలం దగ్గరే పడుకొని గంటకోసారి లేచి చూసేవాళ్లం. రోజు మొత్తం పొలం కాడనే పడిగాపులు కాసేవాళ్లం. లోవోల్టేజీ కరెంట్‌తో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండేవి. పండించిన వడ్ల పైసలన్నీ మోటర్ల రిపేర్‌కు, పెట్టుబడి ఇచ్చిన సేటుకు సరిపోయేది. ఆ రోజులు మళ్లీ రావద్దని దేవుడికి మొక్కుతున్నా. కేసీఆర్ ప్రభుత్వం రైతుల మేలుకోరి 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. రేవంత్‌రెడ్డి మూడు గంటలు చాలంటున్నడు. అయనకు వ్యవసాయం గురించి ఏం తెలుసు. గాలి మాటలు మాట్లాడుడు కాదు.. పొలానికి నీళ్లు పెట్టాలంటే వరికి ఎకరానికి మూడు నుంచి ఐదు గంటలు, పత్తి చేనుకు మూడు గంటలు పడుతుంది. గత కాంగ్రెస్ పాలనలో చూసిన కష్టాలు చాలు. సీఎం కేసీఆర్ వచ్చినంక కరెంట్ ఫుల్లుగా ఉంటుంది. నీళ్లు పుష్కలం. లోవోల్టేజీ సమస్య లేదు. రైతుబంధుతో పెట్టుబడి భయం లేదు. ఎరువుల కొరత లేదు. ఏ బాధా లేకుండా రైతులు మూడు పూటల అన్నం తింటున్నరంటే సీఎం కేసీఆర్ పుణ్యమే.
– ఎదుళ్ల దామోదర్‌రెడ్డి, రైతు, చెన్నారం, కొండమల్లేపల్లి మండలం
మూడెకరాలకు మూడు గంటల కరెంటు సరిపోతదా?
నాకు మూడెకరాల భూమి ఉన్నది. మూడెకరాల భూమిని పారించేందుకు మూడు గంటల కరెంటు సరిపోతదా? మాకు 3గంటల కరెంటు వద్దు.. 24 గంటలు కావాలి. కరెంటు సమస్య రాజకీయ సమస్య కాదు.. ఇది రైతుల సమస్య. తెలంగాణ రైతులు చైతన్యవంతులు. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు. రైతు వేదికల సాక్షిగా రైతులకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలి. 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతాంగం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
– కందిమళ్ల చిన గోపాల్‌రెడ్డి, చెల్లాయిగూడెం, కనగల్ మండలం
పొలంకాడ పడుకునే రోజులు మళ్లీ రావద్దు
తెలంగాణ రాష్ట్రం రాక ముందు కరెంట్ తిప్పలు శానా పడ్డాం. కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వక రాత్రింబవళ్లు పొలంకాడనే పడుకునేటోళ్లం. గిప్పుడు శానా నిమ్మలమైంది. ఉసులు పట్టి మోటరు పెట్టుకుని నీళ్లు పారపెడుతున్నం. గిప్పటి వరకు కరెంటు లేక పంట ఎండిన దాఖలాలు లేవు. పుష్కలంగా నీళ్లున్నయ్. సరిపడా కరెంట్ వస్తుంది. మళ్లీ కాంగ్రెసోళ్లు ఏందో మూడు గంటల కరెంట్ ముచ్చట చెబుతుండ్రు. మూడు గంటలల్ల మూడెకరాలు పారేదెట్ల. అట్లయితే మళ్లీ కరెంట్ కష్టాలు మొదటికొస్తాయి. కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మితే పంటలు ఎండుతయ్.. రైతులు ఆలోచించుకోవాలె.
– మునావత్ మున్యానాయక్, మునావత్ తండా, పీఏపల్లి మండలం
స్వరాష్ట్రంలో పంటలు ఎండుడే లేదు
కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మూడు గంటల కరెంట్‌తో పొలం పారదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే నాణ్యమైన 24 గంటల కరెంట్ వస్తుంది. పంటలు ఎండిపోకుండా నీళ్లు అందుతున్నాయి. ఉచిత విద్యుత్ అందించడం రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. కాబట్టి రైతులు కేసీఆర్ ప్రభుత్వం పక్షాన నిలువాలి.
– శ్రీనునాయక్, అంగడిపేటతండా, పీఏపల్లి మండలం
రేవంత్‌రెడ్డికి పుట్టగతులు ఉండవు
నేను 25ఎకరాలు సాగు చేసుకుంటున్న. ఎప్పుడు బాయికాడ మోటర్ ఆన్ చేసినా కరెంటు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడపాలని చూస్తే ఊరుకోం. టైముకు రైతుబంధు వస్తుంది. నాట్లు వేస్తున్నం. రైతులు ఇప్పుడిప్పుడే మంచిగా బతుకుతున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నరు. కాల్వల్లో చెట్లను తొలగించి సాగునీళ్లు ఇస్తున్నరు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తది.
– ఏర్పుల శ్రీశైలం, రైతు, జంపల్లి, బీబీనగర్ మండలం