సూర్యాపేట, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నాలుగో విడుత రుణమాఫీతో వంద శాతం రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించగా, నేటికీ మాఫీకి నోచని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంకా లక్ష మందికిపైనే రుణమాఫీ కావాల్సి ఉన్నట్లు అంచనా. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 2.15 లక్షల మంది రైతులు రూ.3వేల కోట్ల వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. కాగా, నాలుగు విడతలు కలిపి కేవలం 1,15,533 మంది రైతులకు రూ.969 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. ప్రధానంగా నాలుగో విడతలో కేవలం డెబిట్ ఫెయిల్యూర్ కేసులు ఉన్న 15,009 మంది రైతులకు రూ.132 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. నాలుగో విడుతలోనూ పేరు రాని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు లక్షల పైన రుణం రైతులకు మాఫీపై స్పష్టత లేకపోవడంతో వారంతా అయోమయంలో పడ్డారు.
వానకాలం సీజన్ ముగిసింది. యాసంగి సీజన్లోనైనా పంట రుణాలు తీసుకుందాంలే అనుకున్న రైతులకు నాలుగో విడత రుణమాఫీ జాబితా నిరాశ పరిచింది. గత మూడు నెలల నుంచి అదిగో.. ఇదిగో రుణమాఫీ అంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిండా ముంచింది. 2 లక్షల లోపు రుణం ఉన్న వేలాది మంది రైతులకు వివిధ కారణాలతో రుణమాఫీ కాలేదు. డెబిట్ ఫెయిల్యూర్ కేసులను గుర్తించి రేషన్‌కార్డు ఎడిట్, ఆధార్, బ్యాంకు అకౌంట్లో తప్పులు పూర్తి చేసినా వారి పేరు సైతం నాలుగో విడుత జాబితాలో లేకపోవడం శోచనీయం. రూ.50వేల లోపు నుంచి లక్షన్నర లోపు రుణాలు ఉన్న రైతులకు కూడా మాఫీ కాకపోవడం గమనార్హం. రెండు రోజులుగా రుణమాఫీ కాని వేలాది మంది రైతులు తమ పేరు జాబితాలో ఎందుకు రాలేదో చెప్పాలని జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
సీఎం ప్రకటనతో రెండు లక్షలకుపై రుణాలు ఉన్న రైతుల పరిస్థితి ఏంటనేది తెలియని పరిస్థితి నెలకొంది. సొసైటీలో ఒక విధంగా, బ్యాంకుల్లో మరో విధంగా, వ్యవసాయాధికారులో ఇంకోలా చెబుతుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. రెండు లక్షలకు పైన అప్పు ఉన్న వారు పైన ఉన్న డబ్బులు చెల్లిస్తేనే రుణమాఫీ జరుగుతుందని గతంలో చెప్పడంతో అప్పటికప్పుడు మిగిలిన సొమ్మును అప్పు చేసి మరీ కట్టారు. అప్పటి నుంచి ఆశగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది.
నాలుగో విడుత రుణమాఫీ జాబితా విడుదలైనప్పటికీ జిల్లాలో దాదాపు లక్షకు పైనే మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని తెలుస్తున్నది. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు దాదాపు 2.15 లక్షల మంది ఉన్నారు. నాలుగు విడతలు కలిపి జిల్లాలో కేవలం 1,15,533 మంది రైతులకు మాత్రమే మాఫీ అయ్యింది. నాలుగో విడతలో కేవలం డెబిట్ ఫెయిల్యూర్ కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకుని నిధులు విడుదల చేశారు. ఇన్నాళ్లు రేషన్ కార్డు, ఆధార్ తప్పులు, బ్యాంకు అకౌంట్ నెంబర్లో తేడా అంటూ సాకులు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్నీ సరిచేశాక కూడా ఎందుకు రుణమాఫీ చేయలేదని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండు లక్షలకు పైనే రుణం ఉంటే పైనగదు చెల్లిస్తే మాఫీ అవుతుందని చెప్పి.. ఇప్పుడు మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు.
మొదటి విడుతలో ప్రకటించిన రైతు రుణమాఫీలో నాకు కాకపోవడంతో రెండో విడుతలో అవుతుందని ఆశతో ఎదురుచూసిన. అయినా నా పేరు రాలేదు. కెనరా బ్యాంకులో రూ.లక్షా 70వేల రుణం తీసుకున్నా. ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తూ రెన్యూవల్ చేస్తున్నా. రుణమాఫీ కావడం లేదని బ్యాంకుల చుట్టూ పలుమార్లు తిరిగినా నిరాశే ఎదురైంది.
– దాసరి వెంకటయ్య, రైతు, తూర్పుగూడెం, తుంగతుర్తి మండలం
కెనరా బ్యాంకులో నా భార్య పేరు మీద లక్షా 90వేల రూపాయల రుణం తీసుకున్నాం. వ్యవసాయ, బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రభుత్వం రూ.2లక్షల వరకు అందరికీ రుణమాఫీ చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారులను అడిగితే జాబితా పంపించామని చెప్పారు. మిత్తి పెరుగుతున్నది. రెండు నెలలుగా తిరుగుతన్నా. నాలుగో విడుత వచ్చిందంటే మళ్లీ వచ్చాను. ఇప్పుడు కూడా రుణమాఫీ కాలేదు. రైతుభరోసా లేదు. దీంతో మరింత అప్పుల పాలయ్యం. రుణమాఫీ వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– గుంటి రవికుమార్, రైతు, బొల్లంపల్లి, జాజిరెడ్డిగూడెం మండలం
ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ నాకు రాలేదు. కెనరా బ్యాంకులో రూ.75వేల రుణం తీసుకున్నా. ప్రతి సంవత్సరం బ్యాంకుకు వడ్డీ చెల్లిస్తూ రెన్యూవల్ చేస్తున్నా. అయినా ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ కావడం లేదు. ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.
– గుగులోతు బాలూనాయక్, రైతు, దేవునిగుట్టతండా, తుంగతుర్తి మండలం
నాకు, నా భార్యకు కలిపి ఐదెకరాల పొలం ఉంది. అందులో సగం పత్తి, సగం వరి పండిస్తాం. మా గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో నేను రూ.75వేలు, నా భార్య పేరున లక్ష రూపాయల రుణం తీసుకున్నాం. ఇద్దరికీ కలిపి వడ్డీతో 2లక్షల రూపాయల వరకు అయ్యింది. మాకు రేషన్ కార్డు కూడా ఉంది. కానీ.. రుణమాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే వ్యవసాయ శాఖ అధికారులను కలువమన్నరు. వారిని కలిస్తే ప్రాసెసింగ్‌లో ఉంది.. వచ్చే లిస్టులో అయితది, ఇంకో లిస్టులో అయితదని చెప్పారు. కొత్తగా వచ్చిన లిస్టులో కూడా నాకు గానీ, నా భార్యకు గానీ రుణమాఫీ కాలేదు. అధికారులను అడిగితే 5వ లిస్టు వస్తదని అంటున్నరు. గ్రామంలో ఏమో పూర్తిగా అయిపోయిందని చెప్తున్నరు. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం భావ్యం కాదు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– పిట్టల చిన్న సైదులు, జాన్‌పహాడ్, పాలకవీడు మండలం
వంద శాతం రుణమాఫీ అన్న ప్రభుత్వం మాట ఒట్టిదే. గుడిబండ గ్రామంలోని సర్వే నెంబర్ 25కు చెందిన పట్టా పాస్‌బుక్ పెట్టి రూ.2లక్షల పంట రుణం తీసుకున్నాం. ప్రభుత్వం అన్నట్లు నాకు ఇంత వరకు నయా పైసా కూడా మాఫీ కాలేదు. సీఎం మాటలు విని బ్యాంకుకు పోయి చూసుకున్నాం. రుణమాఫీ కాలేదు. ప్రభుత్వానివి ఒట్టిమాటలే. చేతల్లో సున్నా. నాతోపాటు మా ఊరి చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు.
– యరగాని శ్రీనివాస్‌గౌడ్, రైతు, గుడిబండ (కోదాడ రూరల్)
నాకు మా గ్రామ శివారులో రెండెకరాల భూమి ఉంది. సూర్యాపేట ఎస్బీఐలో 78వేల రూపాయల అప్పు తీసుకున్నా. మూడు విడుతలుగా ఎదురు చూస్తున్నా. ఇప్పటికీ రుణ మాఫీ కాలేదు. బ్యాంకుకు వెళ్తే సరైన సమాధానం చెప్తలేరు. లిస్టులో మీ పేరు లేదంటుండ్రు. ఈ కొద్దిపాటి రుణం కూడా మాఫీ కావట్లేదు. అసలు అయితయో.. కావో నమ్మకం లేకుండా పోయింది. ఆఫీసర్లను అడిగితే బ్యాంకులో అడగమంటుండ్రు. ఎన్ని సార్లు బ్యాంకుకు వెళ్లినా మాఫీ కాలేదంటున్నారు. మాలాంటి పేద రైతులకు న్యాయం చేయాలి. మాఫీ చేస్తమని చెప్పి మమ్ములను మోసం చేస్తున్నరు. మా రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుద్ది. రైతులందరికీ రుణమాఫీ చేసి ఆదుకోవాలి.
– కొప్పు భాగ్యమ్మ, రైతు, గుంజలూరు, చివ్వెంల మండలం
నాకు అన్నారం ఎస్బీఐ బ్యాంకులో రూ.84వేల పంట రుణం ఉంది. కాంగ్రెస్ ప్రభు త్వం నాలుగు సార్లు మాఫీ ప్రకటించినా రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. వ్యవసాయ అధికారులకు ఎన్నిమార్లు జిరాక్స్ కాగితాలు ఇచ్చినా లిస్ట్‌లో నా పేరు రాలేదు. ప్రభుత్వం అందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని చెబుతుంది. కానీ.. నాకు రూ.84వేలు ఉన్నా మాఫీ కాలేదు.
– మామిడి ఆండాలు, రైతు, అనంతారం, పెన్‌పహాడ్ మండలం
అన్నారం ఎస్బీఐ బ్యాంకు లో పంట రుణం తీసుకున్న. అసలు, వడ్డీ కలిపి రూ.1.45 లక్షలు అయ్యిందని బ్యాంకువారు చెప్పారు. ఆగస్టులోపు 2లక్షల రుపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు విడుతలగా చేసినా నాకు మాఫీ కాలే దు. నాకంటే ఎక్కువ వడ్డీ అయినోళ్లకు మాఫీ వచ్చింది. కాంగ్రెసోళ్లు అధికారంలోకి రాగానే మాట మార్చిండ్రు.
– బైరెడ్డి నాగార్జున్‌రెడ్డి, రైతు, అనంతారం, పెన్‌పహాడ్ మండలం