రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న జిల్లాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో సన్నాలు పం డించిన రైతులకు బోనస్ ప్రయోజనం అతిస్వల్పంగానే దక్కింది. యాసంగి సీజన్లో సన్నాల దిగుబడి అంచనాలు భారీగా ఉండగా అందులోనూ సగానికి పైగానే కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆచరణలో ప్రభుత్వ కేంద్రాలపై నమ్మకం లేక, కొనుగోలు విధానంలోని కొర్రీల వల్ల సన్నధాన్యం ఇక్కడ అమ్మేందుకు రైతులు విముఖత చూపారు. దీంతో రైతులంతా ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే నాటికే మెజార్టీ ధాన్యాన్ని నేరుగా మిల్లర్లకే అమ్ముకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు సుమారు రూ.750కోట్ల బోనస్‌ను కోల్పోయారు. దీనికితోడు మిల్లు పాయింట్ల వద్ద విక్రయించేందుకు రైతుల ఆతృతను ఆసరాగా చేసుకొని మిల్లర్లు, వ్యాపారులు సైతం సిండికేట్‌గా మారి ధర తగ్గించా రు. దీనివల్ల కూడా క్వింటాలుకు మద్దతు ధరతో పోలిస్తే మరో రూ.200 నుంచి 300 ధరను రైతులు కోల్పోయారు. మద్దతు ధర లభించకపోగా ప్రభుత్వం ఇస్తామన్న క్వింటాలుకు రూ.500 బోనస్‌ను కూడా రైతులు కోల్పోయారు. ఇవన్నీ కలిపి అటుఇటూ రైతులు సుమారు రూ.వెయ్యి కోట్ల నష్టపోయారని అంచనా.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 20(నమస్తే తెలంగాణ): ఉ మ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగి సీజన్లో మొత్తం 1063 ధా న్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వీటిల్లో కొన్నిచోట్ల ప్రత్యేకంగా సన్నధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో నెల రోజుల పాటు ఒక్క గింజ కూడా ఈ కేంద్రాలకు రాలేదు. చివర్లో మాత్రం కొందరు రైతులతో పాటు దళారులు సైతం బోనస్ కోసం అరకొరగా సన్నాలను కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించారు.
యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో దాదాపు 29.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేయ గా, ఇందులో సుమారు 17.57 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉం డవచ్చని అధికారులు అంచనా వేశారు. సన్నాల్లో కనీసం సగానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అధికారులు భావించారు. కానీ ఆచరణలో సన్నాల రాకపై బొక్కాబోర్ల పడ్డారు. చివరికి పరిశీలిస్తే ఉమ్మడి జిల్లా కలపి మొత్తం 76వేల మెట్రిక్ టన్ను ల సన్నధాన్యం మాత్రమే కేంద్రాలకు వచ్చింది. దీనికి మాత్రం ప్రభుత్వం అందించనున్న రూ.38కోట్ల బోనస్ రానుంది.
మిగతా ధాన్యం అంతటికీ రైతుల బోనస్ కోల్పోయినట్లే. ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటా ఒక్కంటికి మద్దతు ధరపై రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అధికారంలోకి రాగానే సన్నవడ్లకే బోనస్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సన్నవడ్లను తెచ్చి న రైతులకే రూ.500 బోనస్ అని తిరకాసు పెట్టారు. ఇది ఎలాగూ నల్లగొండ జిల్లాలో ఆచరణసాధ్యం కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వాస్తవంగా కొనుగోలు కేంద్రా ల్లో సన్నధాన్యం విక్రయా లకు నానారకాల షరతులు అడ్డంకిగా మారాయి. సాధారణంగా సన్నవడ్లను రైతులు నేరుగా పొలాల్లో వరికోత యంత్రాలతో కోసి ట్రాక్టర్లలో నింపుకొని దగ్గరలోని రైసు మిల్లులకే తరలిస్తుంటారు. అక్కడ తేమశాతంతో సంబంధం లేకుండా మిల్లర్లు ప్రభుత్వ మద్ద తు ధరకు అటూఇటూగా కొనుగోళ్లు చేస్తుంటారు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి కొన్నిసార్లు మద్దతు ధరకు మించి కూడా సన్నాలకు ధర లభిస్తుంటుంది. మరికొన్ని సార్లు ధాన్యం రాకను బట్టి ధర తగ్గుతూ కూడా ఉంటుంది. రైసు మిల్లులకు తీసుకెళ్లే సన్నవడ్ల ల్లో తేమశాతం కనీసం 23 నుంచి 28 వరకు ఉండడం సహజం. ఇంత తేమ శాతం ఉన్నా సరే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్న మిల్లర్లు దీని నుంచే నాణ్యమైన బియ్యాన్ని ఎగుమతి చేస్తుంటారు. దీనివల్ల అమ్ముకునే రైతులకు ఇబ్బంది లేదు… కొనుగోలు చేసే మిల్లర్లకు సన్నాల్లోని తేమశాతంతో నష్టం లేదు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా నేరుగా రైతులు సన్నాలను రైసుమిల్లులకే తరలించి అమ్ముకున్నారు. క్వింటాల్‌కు రూ.2100 నుంచి రూ.2400 వరకు ధర లభించింది. బోనస్ గురించి ఆలోచిస్తే అసలుకే ఎస రు వస్తుందని రైతులు ప్రైవేటుగా అమ్ముకునేందుకు మొగ్గు చూపారు.
మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మిల్లర్లే సన్నాల్లో సింహభాగం నేరుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఈ సీజన్లో 17.57లక్షల మెట్రిక్ టన్నుల సన్నాల దిగుబడి అంచనా వేయగా సుమారుగా 15లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు మిల్లర్లు కొనుగోలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. మిల్లు పాయింట్ల వద్ద ఒకేసారి ధాన్యం పోటెత్తినప్పుడు ఇదేఅదునుగా మిల్లర్లు, వ్యాపారులు ధాన్యం ధర తగ్గించి రైతులను నిలువుదోపిడీ చేశారు. పక్క రాష్ర్టాల నుంచి కూడా సన్నాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకొని ఇక్కడి రైతులకు మద్దతు ధర కూడా చెల్లించలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయాలు జరగ్గా రైతులు సుమారు రూ.750 కోట్ల బోనస్‌ను కోల్పోయినట్లు సమాచారం. రైతులు నేరుగా సన్నాలను మిల్లర్లకు విక్రయించడం ద్వారా పౌర సరఫరాల శాఖకు కూడా సన్నబియ్యం లభించడం అంత సులభం కాదు.
సన్నాలను విక్రయించాలంటే 17శాతం తేమ ఉండాలన్నది ప్రాథమిక నిబంధన. కానీ సన్నాలకు అదీ సాధ్యం కాదనేది రైతు ల అభిప్రాయం. సన్నాలను ఆరబెట్టినా క్విం టాల్ ఒక్కంటికీ కనీసం 8 నుంచి 10 కిలోల వర కు తూకం తగ్గిపోతుంది. రూ.500 బోనస్ కోసం ఆశపడితే రోజుల తరబడి గోస పడాల్సిందేనన్న భయంతో రైతులు సన్నాల కొనుగోలు కేంద్రాల వైపు చూడడం లేదు. దీనికంటే కోసిన పంటను పొలాల నుంచి నేరు గా మిల్లులకు తరలిస్తే తూకంలోనూ బోనస్ మందం కలిసి వస్తుందని రైతులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ బోనస్ వైపు సన్నాల రైతులు ఆలోచించడమే మేనేశారు. నిజంగా ప్రభుత్వ మద్దతు ధరకు బోనస్‌తో కలిపి రైతులకు ఒక్కో క్వింటాల్ సన్నాలకు రూ.2820 ధర దక్కాలి. కానీ ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ధర దక్కింది కేవలం 76వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికే కావడం గమనార్హం. యాదాద్రి జిల్లాలో 970 మెట్రిక్ టన్నులు కాగా, నల్లగొండ జిల్లాలో 23,700 మెట్రిక్ టన్నులు, సూర్యాపేటలో 51వేల మెట్రిక్ టన్నుల సన్నాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.