సూర్యాపేట, సెప్టెంబర్ 3: సూర్యాపేటలోని సీతారాంపురం పీఎసీఎస్ వద్ద యూరియా కోసం వారం రోజులుగా వేకువజామునే వచ్చి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదంటూ ఆగ్రహంతో రైతులు బుధవారం సూర్యాపేట-మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నాట్లు పడినా యూరియా దొరకడం లేదని, ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో పీఏసీఎస్ వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నామన్నారు. చంటి పిల్లలను సైతం సంకలో వేసుకొని తిండీతిప్పలు మానుకొని యూరియా కోసం క్యూకడితే అధికారు లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం యూరియా ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్..అంటే విసుక్కుంటున్నారని అన్నారు. వారం రోజుల్లో యూరియా వేయకుంటే పొలాలు చేతికి రావని తమ కష్టం వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఎరువుల దుకాణాలకు వెళితే వారు అవసరం లేని అడుగు మందు, పనికిరాని ఎరువులను అధిక ధరలకు అంటగడుతున్నారన్నారు.
తమ లాంటి పేద రైతులు అవసరంలేని ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసి ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. పీఏసీఎస్ సెంటర్‌కు యూరియా కోసం వస్తే ఆధార్ జీరాక్స్ అడుగుతున్నారే తప్ప యూరియా ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పడం లేదన్నారు. రైతులు కార్యాలయం వద్ద ఉండగానే అధికారులు తాళాలు వేసుకొని వెళుతున్నారని అన్నారు. దాదాపు 23 తండాలు, 18 గ్రామ పంచాయతీలకు చెందిన రైతులు వేకువజామున వచ్చి యూరియా కోసం క్యూలో నిలబడినా పట్టించుకోవడంలేదన్నారు. రైతులంటే ప్రభుత్వానికి, అధికారులు చిన్న చూపని తమ బాధను వ్యక్తం చేశారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోడ్లపైకి వచ్చామని, అధికారులు వచ్చి యూరియా ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రాస్తారోకో చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
శాలిగౌరారంలో అవస్థలు
శాలిగౌరారం, సెఫ్టెంబర్ 3 : అదును దాటిపోతుండటంతో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ పరపతి సహకార సంఘం కార్యాలయానికి బుధవారం 444 బస్తాల యూరియా రావడంతో రైతులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా ఉన్న క్యూలై న్లో నిలబడి నానా ఇబ్బందులు పడ్డారు.
యూరియా కోసం రైతుల తిప్పలు
నల్లగొండ, సెప్టెంబర్ 3: నల్లగొండలోని వెంకటేశ్వర్ ట్రేడర్స్ వద్ద యూరియా కోసం పొద్దం తా పిల్లలు, మహిళలు, వృద్ధులు లైన్లో నిలబడినా ఒక్క బస్తా కూడా దొరకక నిరాశతో వెనదిరిగారు. యూరియా నిల్వలు తెప్పించటం లో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండల అద్యక్షుడు దేప వెంకట్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డుపై గంట పాటు రాస్తారోకో చేయ గా, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలో సీఎం తర్వాత రెండోస్థానం నాదే అని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి నల్లగొండ రైతాంగానికి యూరియా ఎందుకు తెప్పించ టం లేదని బీఆర్ఎస్ నేతలు దేప వెంకట్ రెడ్డి, తుమ్మల లింగస్వామి, శంకర్ ప్రశ్నించారు.
మఠంపల్లిలో రోడ్డెక్కిన అన్నదాతలు
మఠంపల్లి, సెప్టెంబర్ 3: మఠంపల్లిలో రైతులు యూరియా కోసం పీఏసీఎస్ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు పడడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్లో డీలర్ల వద్ద యూరియా లేకపోవడంతో వ్యవసాయ సహకార సంఘాల ఎదుట రైతులు క్యూకడుతున్నారు. మూడు రోజులు గా పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నా యూరి యా దొరక్కపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. మట్టపల్లి-హుజూర్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
యూరియా కోసం బీఆర్ఎస్ నేతల ధర్నా
గుర్రంపోడు, సెప్టెంబర్ 3: రైతులకు తగిన యూరియాను అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని నల్గొండ-దేవరకొండ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజూ రైతులు యూరియా కోసం రోడ్లపైకి వస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. యూరియా, విత్తనాల సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
కోదాడ- జడ్చర్ల హైవేపే రైతుల ధర్నా
త్రిపురారం, సెప్టెంబర్ 3: నిద్రాహారాలు, అన్నం నీళ్లు మానుకొని క్యూలైన్లలో నిలబడినా యూరియా దొరకడంలేదంటూ బుధవారం మండల కేంద్రంలోని కోదాడ-జడ్చర్ల హైవేపే రైతులు ధర్నాకు దిగారు. తెల్లవారుజాము నుంచి భార్యభర్తలతోపాటు పిల్లలు, వృద్ధులు కూడా క్యూలైన్లో నిలబడినా యూరియా దొరకలేదని, ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు క్యూలో నిలబడినా రెండు కట్టల యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వర్ బిజీ..యూరియా ఇవ్వలేం..
పెన్‌పహాడ్, సెప్టెంబర్ 3 : మండల పరిధిలోని నారాయణగూడెం సహకార సంఘం కార్యాలయం వద్ద బుధవారం ఉదయం నుంచే వం దలమంది రైతులు యూరియా కోసం గంటలపాటు నిరీక్షించారు. సొసైటీకి 150 బస్తాల యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీసంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. అయితే రైతులు భారీ సంఖ్యలో రావడంతో సర్వర్ బిజీగా ఉంది.. ఇప్పుడు యూరియా ఇవ్వలేమంటూ సాకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీం తో రైతులు ప్రభుత్వం తమకు సరిపడా యూ రియాను అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా ఇస్తరా..చంపుతారా..!
తుంగతుర్తి, సెప్టెంబర్ 3 : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం రైతులు యూరియా కోసం రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా కోసం పడరాని పాట్లు
పెద్దవూర, సెప్టెంబర్ 3: యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. మం డలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచి యూరియా కోసం లైన్లో నిల్చొన్నా కూడా యూరియా అందడం లేదని వాపోతున్నారు. యూరియా గోస తీరలే…!
నిడమనూరు, సెప్టెంబర్ 3: మం డలంలోని రైతులకు యూరియా అందకపోవడంతో గోస పడుతున్నారు. నాట్లు వేసి నెలన్నర గడిచినా యూరియా దొరకడం లేదు. ఫలితంగా నిడమనూరు పీఏసీఎస్ వద్ద తెల్లవారక మునుపే లైన్లు కడుతున్నారు. నాలుగు రోజుల క్రితం 20 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ జరిగింది. మళ్లీ పంపిణీ చేయకపోవడంతో రైతులు యూరియా కోసం పీఏసీఎస్ గేటు వద్దకు తెల్లవారేసరికే చేరుకుంటున్నారు. రైతులు, మహిళలతో కలిసి నిరీక్షించడంతోపాటు ఏకంగా గేట్లు ఎక్కి లోపలకు దిగి బారులుదీరుతున్నారు.
యూరియా లేదన్నా టోకెన్లు ఇవ్వాలని కోరడంతో ఉద్రిక్తత నెలకొంది.
రోజులతరబడి తిరుగుతున్న అన్నదాతలు
తిప్పర్తి,సెప్టెంబర్ 3: మండల కేంద్రంలోని ఎన్డీసీఎంకు సోమవారం 10 టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో రైతు లు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో యూరి యా పంపిణీని నిలిపివేశారు. మళ్లీ బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు 20 టన్నులు రావడంతో రెండు సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు. దీంతో రైతులు పెద్ద సం ఖ్యలో క్యూకట్టారు. మహిళా రైతులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పనులను మానుఖఒని రోజుల తరబడి క్యూలో నిల్చు న్నా ఒకరికి రెండు బస్తాలే ఇవ్వడంతో రైతు లు నిరాశ చెందారు.
ఒక్క కట్ట
ఇప్పించండి సారూ..దామరచర్ల, సెప్టెంబర్ 3: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రోజులతరబడి తిరుగుతున్నా ఒక్క కట్ట కూడా దొరకడం లేదు. నాటిన పొలాలు ఎదగడం లేదు ‘దయచేసి ఒక్క కట్ట యూరియా ఇప్పించండి సారూ’.. అంటూ రైతుల అధికారులను వేడుకుంటున్నారు. మండలంలోని గిరిజన తండాలు, మారుమూల గ్రామాల రైతులు మూడు రోజుల నుంచి తిరుతున్నా యూరియా దొరక్క పోవడంతో రైతులు మండల కేంద్రంలోని నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై బుధవారం ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా పీఏసీఎస్ వద్ద యూరియా కోసం పడిగాపులు కాసి, ఒపిక నశించడంతో వారు గత్యంతరం లేక ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇల్లూ వాకిలి వదలి మండల కేంద్రంలో పడిగాపులు కాస్తున్నామని, అయినా యూరియా ఎప్పుడొస్తుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై రైతులు బైఠాయించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న వాడపల్లి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి దామరచర్లకు వచ్చి రైతులు సముదాయించారు.
నెలరోజులుగా రైతుల చక్కర్లు!
హాలియా, సెప్టెంబర్ 3: సాగర్ నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా ఉం ది. ఎరువుల దుకాణాల్లో యూరియా లేకపోవడంతో రైతులు నెలరోజులుగా సహకా ర సంఘ కార్యాలయం ఎదుట క్యూకడుతున్నారు. తిరుమల గిరి సాగర్ మండలం లో సహకార సం ఘం లేకపోవడం, అనుముల, పెద్దవూర, గుర్రంపోడు మండలా ల్లో ఒక్కో సహకార సంఘ కార్యాలయమే ఉండటం, త్రిపురారం, నిడమనూరు మం డలాల్లో రెండేసి సహకార సంఘాలు ఉ న్నా రైతులకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేకపోతున్నాయి. నిత్యం పొ లంలో వ్యవసాయ పనులు చేయాల్సిన రై తులు యూరియా కోసం నెల రోజులుగా పనులను పక్కకు పెట్టి సహకార సంఘ కా ర్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా రు. సహకార సంఘ సిబ్బంది ఒక్కో రైతు కు 2 బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో పది ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు గత నెల రోజులుగా యూరియా కోసం నిత్యం క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది.