కట్టంగూర్, జూలై 14 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, అధికారిక రికార్డుల్లో చూపిస్తున్న కరెంటు వేళలకు క్షేత్రస్థాయిలో అందుతున్న కరెంటుకు పొంతన లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల విద్యుత్ సబ్ స్టేషన్లో లాగ్ బుక్‌తో పాటు పక్కనే ఉన్న పంట పొలాలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, సాగునీరు, ఎరువులు సక్రమంగా అందడం లేదన్నారు. సబ్‌స్టేషన్ లాగ్‌బుక్స్‌లో రోజుకు 17 నుంచి 18 గంటల త్రీ ఫేజ్ విద్యుత్, మరో 6 నుంచి 7 గంటల సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తప్పుడు లెక్కలు రాస్తున్నారని, వాస్తవంగా రైతులకు రోజుకు 8 నుండి 10 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు.
బ్రేక్‌డౌన్ కారణంగా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నా, రికార్డుల్లో మాత్రం కొద్ది నిమిషాల అంతరాయంగా నమోదు చేస్తున్నారని విమర్శించారు. తక్కువ వోల్టేజ్, తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల మోటార్లు, స్టార్టర్లు కాలిపోతుండగా, పంటలు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. అధికారులు పైస్థాయి ఆదేశాల మేరకే రికార్డులు నమోదు చేస్తున్నామని ఆపరేటర్లు చెప్పినట్లు ఆయన తెలిపారు. రైతులకు యాప్ విధానం కారణంగా యూరియా ఎరువులు సకాలంలో అందడం లేదని, రైతుబంధు, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల రక్తం కావాలంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆంధ్రకు నీళ్లు పోతుంటే చేతులు నలుపుకుంటూ చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. మార్కెట్లలో ధాన్యం విక్రయానికి రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కాళేశ్వరం, ఏఎమ్మార్పీ వంటి సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని ప్రభుత్వం సక్రమంగా వినియోగించడం లేదని, కాలువలకు నీరు అందక చెరువులు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలకు తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు, యూరియా ఎరువులు, రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు వెంటనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, స్థానిక సర్పంచ్ వడ్డే మాధవి సైదిరెడ్డి, ఉప సర్పంచ్ బండారు కృష్ణ, వార్డు సభ్యులు బండారు విజయ్ కుమార్, పొందు సైదులు, బండారు అంజయ్య, నాయకులు ఆచారి మహేష్, మహేందర్ రెడ్డి, బండారు మహేష్ ఉన్నారు.