నల్లగొండ ప్రతినిధి, మే 15(నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయని, కొనుగోళ్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, తాలు పేరుతో ఐదారు కిలోల తరుగు, లారీల కోసం డబ్బు వసూలుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మంత్రుల ఎదుట వాపోయారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై గురువారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఎమ్మెల్యేలంతా అధికారపార్టీ వారే ఉండటంతో కొనుగోళ్ల తీరుపై విమర్శలు చేస్తే ఇరకాటంలో పడతామని భయపడిన మంత్రులు వారితో కలెక్టర్ ఛాంబర్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు బీఆర్ఎస్, సీపీఐ ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, నెల్లికంటి సత్యం, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న కొనుగోళ్ల తీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయిందని, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించారు. మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ల తీరుతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు బీఆర్ఎస్, సీపీఐ ఎమ్మెల్సీలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వివరించారు.
తాలు, తేమ పేరుతో ఐదారు కేజీల తరుగు తీస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. లారీలు రావాలంటే రైతులు బస్తాకు ఇంత ఇవ్వాలన్న కొత్త సంప్రదాయానికి తెరలేపారని ప్రస్తావించారు. ఏ కేంద్రంలో అయితే రైతులు ఎక్కువ డబ్బు ఇస్తున్నారో అక్కడికే లారీలు వస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అధికారులు చెప్పినట్లు లేవని, తక్షణమే సీరియస్ చర్యలు అవసరమని తెలిపారు. కొనుగోళ్ల తీరు మారకపోతే రైతులు క్షమించేలా లేరన్నారు. ఇలాంటి సమీక్ష, పర్యటనలు పక్షం రోజుల ముందు చేసి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదన్నారు. ఇప్పటికైనా మిల్లుల్లో అన్లోడింగ్ వేగవంతం చేయడంతో పాటు ఎక్కువ లారీలను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, నెల్లికంటి సత్యం వెల్లడించారు. ఇక ముందు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా పూర్తయ్యేలా చర్యలు చేపడదామని మంత్రులు తెలిపారు.