కోదాడ, సెప్టెంబర్ 01 : కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పీఏసీఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. పక్షం రోజుల నుంచి బాధలు పడుతున్నప్పటికీ అధికార, ప్రజా ప్రతినిధులకు మాత్రం తమపై దయ కలగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సొసైటీల ఎదుట పడికాపులు కాస్తున్నప్పటికీ ఫలితం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటేసినందుకు తమకు ఇదేం కర్మ అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు. నడిగూడెం, మునగాలతో పాటు నియోజకవర్గంలోని ఇతర సొసైటీల ఎదుట ఇదే పరిస్థితి నెలకొన్నది.
నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులకు కళ్లెదురుగా కనపడుతున్నా తమ బాధలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ దుస్థితి లేదని, అవసరానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకేదో చేస్తారని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందంటున్నారు. 2,020 మంది రైతులు ఉన్న నడిగూడెం సొసైటీకి 400 యూరియా బస్తాలు వస్తే ఎలా సరిపోతాయని వారు ప్రశ్నించారు. పొలం పనులు మానుకుని యూరియా కోసం పడిగాపులు కాస్తున్న తమ కష్టాలను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని అధికారులు, అధికార ప్రజా ప్రతినిధులను రైతులు వేడుకుంటున్నారు.
Kodada : సొసైటీల ఎదుట అన్నదాతల అగచాట్లు