చందంపేట, మే 14 : ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు పండించిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరు.. లారీల కొరత.. తూకంలో తరుగు ఇలా ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభమై 20 రోజులైనా
చందంపేట మండలం గుంటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తిమ్మాపురం సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. సుమారు 194 మంది రైతులు ఇప్పటి వరకు ధాన్యం తెస్తే కేవలం 34 మంది నుంచి మాత్రమే కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా రైతుల ధాన్యం మ్యాచర్ వచ్చినప్పటికీ కొనుగోలు చేయడంలో తాత్సారం చేస్తున్నారు. బస్తాల్లో ధాన్యాన్ని నింపినప్పటికీ కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు.
లారీల కొరత..
కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో తగినన్ని లారీలు లేకపోవడంతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. తగిన సంఖ్యలో లారీలను అందుబాటులో ఉంచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు రోజుల తరబడి కొనుగోలు కేంద్రం వద్దనే ఉంటున్న రైతులు తాగునీరు, నీడ, సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
పది రోజులు దాటినా ధాన్యం కొంటలేరు..
నాకున్న మూడెకరాల్లో వరి సాగు చేస్తే 12 పుట్ల దిగుబడి వచ్చింది. వడ్లను అమ్ముదామని ఇక్కడికి వచ్చి పది రోజులు దాటింది. అయినా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఇక్కడ సరైన వసతులు కూడా లేవు. కనీసం అధికారులు వచ్చి చూస్తలేరు.. మందలిస్తలేరు.. ఇట్లా అయితే పంటను ఎట్లా అమ్ముకోవాలి. ఒక వైపు వర్షం పడుతుందనే భయం ఉంది.. ఈ తీవ్రమైన ఎండలను తాళలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
-కేతావత్ రుక్కి, లెడ్పతండా, రైతు
ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

డిండి, మే 14 : కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల రైతులకు అపార నష్టం జరుగుతోందని, ఎటువంటి ఆం క్షలు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం తవక్లాపూర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ మండల నాయకులు, రైతులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ..అప్పు తెచ్చి ఆరుగాలం కష్టపడి పంట పండిసే ్తకొనే దిక్కులేకపోవడంతో రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, ఒక్క గిం జను కూడా ప్రభుత్వం కొనలేదన్నారు. సకాలంలో గన్నీ బ్యాగులను సరఫరా చేసే పరిస్థితిలో ప్రభు త్వం లేదని ధ్వజమెత్తారు. తరుగు పేరుతో బస్తాకు రెండు కిలోల వడ్లు అదనంగా తూకం వేస్తున్నారని అధికారులు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, దోపిడీని అడ్డుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు, ఎర్రగుంటపల్లి సర్పంచ్ మల్రెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి, రవీందర్రావు, గొడుగు వెంకటయ్య, గిరమోని శ్రీను, రమావత్ తులసీరామ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
20 రోజులుగా కొనుగోళ్లు బంద్
గుడిపల్లి, మే 14: గుడిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 రోజులుగా లారీలు రావట్లేదనే కారణంతో అధికారులు మ్యాచర్ తీయడం బంద్ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా ఇక్కడ సుమారు 150 ధాన్యం కుప్పలు ఉన్నాయి. గతంలో 30 కుప్పలకు మాత్రమే మ్యాచర్ చూసి లారీల ద్వారా ధాన్యాన్ని తరలించారు. కానీ 20 రోజులుగా లారీలు రావడం లేదని అధికారులు కొనుగోలు కేంద్రం వైపు తొంగిచూడటం లేదు. పక్క గ్రామ పంచాయతీ అయిన సింగరాజుపల్లి ఆవాసం ఆంజనేయపురం గ్రామానికి చెందిన రైతు ఒకరు మాట్లాడుతూ..15 రోజుల క్రితం ధాన్యాన్ని తెచ్చానని, ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మ్యాచర్ చూసేందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి తోడు వర్షం కురిస్తే కప్పేందుకు తగిన టార్పాలిన్ పట్టాలు కూడా లేవని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతున్నారు. మ్యాచర్ వచ్చినా..బస్తాలు నింపి ఇక్కడే ఉంచారు కాని లోడింగ్ చేయట్లేదని పేర్కొంటున్నారు.