మునుగోడు, ఏప్రిల్ 14 : మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రైతులు ఎండాకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు తూకం వేయడంలో ఆలస్యం చేస్తున్నారని, నాణ్యత (మాయిశ్చర్) పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూకం ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
వేసవి కాలంలో కొనుగోలు కేంద్రాలు సమయానికి ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్, అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేసి తూకం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రైతులు కూడా ధాన్యాన్ని సరిగ్గా ఎండబెట్టి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ వంతు కృషి కొనసాగిస్తామని తెలిపారు.