Punjab woman : కెనడాలో పంజాబ్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలిని 26 ఏళ్ల నవనీత్ కౌర్‌గా గుర్తించారు. నిందితుడు శర్ణ్జీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఈనెల 24న కెనడా రాజధాని టొరంటోలో జరిగింది. హుంబర్వుడ్ బోలేవార్డ్ రెక్స్‌డేల్ బోలెవార్డ్ ఏరియాలో ఒక యువతి తుపాకి గాయాలతో పడి ఉన్నట్లు శుక్రవారం ఉదయం 7.23 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవనీత్ కౌర్ గాయాలతో పడి ఉండటాన్ని గమనించి, ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శర్ణ్జీత్ సింగ్.. నవనీత్ కౌర్‌ను ఫాలో అవుతూ వెళ్లాడు. ఇద్దరి మధ్యా కొంతసేపు సంభాషణ జరిగింది. అనంతరం అతడు నవనీత్ కౌర్‌ను గన్‌తో కాల్చి, అక్కడినుంచి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు, ఎమర్జెన్సీ సర్వీసుకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె మరణానంతరం హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. నిందితుడు శర్ణ్జీత్ సింగ్‌ను అరెస్టు చేశారు.
అతడు భారతీయ సంతతి వ్యక్తి. అతడు కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. అతడిపై ఒంటారియో పోలీసులు ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. ఈ హత్య అనుకోకుండా చేసింది కాదని, ఉద్దేశపూర్వకంగా, ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు అభియోగాలు మోపారు. అయితే, ఈ హత్యకు గల కారణాలు తెలియలేదు. ఇటీవలే కెనడాలో మరో పంజాబ్ యువతి కూడా హత్యకు గురైంది. ఆమెను తన సహజీవన భాగస్వామి హత్య చేశాడు. అతడు కూడా భారతీయుడే.