గుడిపల్లి, మే 21: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం జడ్చర్ల – కోదాడ హైవేపై మండలంలోని రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలపడంతో సుమారు రెండు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుడిపల్లి మండలంలోని కోదండాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీల కొరత సాకుగా చూపుతూ ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు వాపోయారు.
విషయం తెలుసుకున్న గుడిపల్లి ఎస్సై రైతులకు, బీఆర్ఎస్ నాయకులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు పేర్కొన్నారు. దీంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, తాసీల్దార్ మధు హాసిని అక్కడికి వచ్చి రోజూ ఐదు లారీల చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యల్గూరి వల్లపురెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తోటకూరి పరమేశ్, అర్వపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, గన్నెబోయిన వెంకటయ్య, జగన్, రమావత్ శ్రీనూ నాయక్, దామోదర్ నాయక్, కోదండాపురం, భీమనపల్లి, గణపురం, మాదాపురం గ్రామ రైతులు పాల్గొన్నారు.