ఈ యాసంగి ఎవుసం రైతన్నకు కష్టాల కడలిగా మారింది. ఓవైపు భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. కొద్దోగొప్పో బోర్లు పోస్తున్న చోట కూడా విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో లో ఓల్టేజీ సమస్య రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నది. మోటార్లు, ట్రాన్స్ఫార్మార్లు కాలిపోతుడడంతో మరమ్మతుల కోసం మరింత నష్టపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్ల రిపేర్‌లో నెలకొన్న జాప్యం కారణంగా నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ సర్కారులో నాణ్యమైన నిరంతర విద్యుత్‌తో సంతోషంగా వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడు సమస్యతో కుమిలి పోతున్నారు.
మునుగోడు మండలంలో 5,500 ఎకరాల్లో రైతులు వరి నాటు పెట్టారు. బోర్ల ఆధారంగా సాగు చేస్తున్న రైతులు విద్యుత్ లో ఓల్టేజీ సమస్యలతో సతమతం అవుతున్నారు. తరుచూ మోటార్లు , టాన్స్ఫార్మార్లు కాలిపోతుండడంతో పొట్ట దశలో నీళ్లు అందక సాగు పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు మరమ్మతుల భారమూ ఆర్ధికంగా దెబ్బతీస్తున్నది. మండలంలో ఇప్పటికే 1,200 ఎకరాల్లో పంటలు ఎండిపోగా, రైతులు పశువులకు మేతకు వదిలిపెట్టారు. మిగిలిన పంటనైనా కాపాడుకోవాలని భగరీథ ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రం ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని రైతులు ఫిర్యాదు చేస్తే ట్రాన్స్‌కో సిబ్బందే వచ్చి మరమ్మతుల కేంద్రానికి తీసుకువెళ్లాల్సి ఉండగా, కనీస స్పందన ఉండడం లేదు. కిందామీద పడి రైతులే ట్రాన్స్ఫార్మర్లను తీసుకు వెళ్లినా రిపేర్‌కు మూడు, నాలుగు రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు.
ఈ జాప్యంతో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. మునుగోడు మండలం కల్వలపల్లికి చెందిన రైతు గుండబోయి యాదయ్య నాలుగెకరాల్లో వరి సాగు చేస్తే బోర్లలో నీళ్లు తగ్గి రెండెకరాల్లో పంట ఎండింది. మిగిలిన రెండెకరాలు ట్రాన్స్ఫార్మర్ రిపేర్‌తో ఆలస్యం కారణంగా ఎంపోయిందని యాదయ్య తెలిపారు. ఆ ట్రాన్స్ఫార్మర్ కింద సాగు చేసిన ఎనిమిది రైతులదీ ఇదే పరిస్థితి అని వివరించారు.మునుగోడుకు చెందిన ఉప్పుత్తుల యాదయ్య అనే రైతు మాట్లాడుతూ ‘నాకున్న ఎకరం భూమిలో వరి పెట్టిన. బోరులో నీళ్లు తగ్గడం, కరెంటు కోతల వల్ల పంట పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడి 35 వేల రూపాయలు అయ్యింది. ఆఖరికి అప్పులే మీద పడినయ్’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సరారులో కరెంటుకు ఎన్నడూ సమస్య రాలేదని గుర్తుచేసుకున్నారు.
ఈ ఎండిన వరి చేనులో పశువులను మేపుతున్న ఈ రైతు పేరు పాలకూరి అంజయ్య. ఊరు మునుగోడు మండలం సింగారం. రెండెకరాల్లో వారి నాటు పెడితే నీళ్లు తగ్గి బోరు ఆగి ఆగి పోస్తుండడం వల్ల ఇప్పటికే ఎకరంన్నర పంట ఎండిపోయింది. మిగిలిన అరెకరం అయినా చేతికి రాకపోతుందా అని ఆశతో ఉంటే కరెంట్ లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా వేధిస్తున్నదని అంజయ్య వాపోయారు. కరెంట్ ప్రాబ్లెమ్ ఇట్లనే ఉంటే గింజ గూడ దక్కదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకర్గంలోని మోత్కూరు మండలంలో ఎక్కువ మంది రైతులు మూసీ నది, బిక్కేరు వాగులపై ఆధారపడి బోర్లు, బావులతో వరి సాగు చేస్తున్నారు. కానీ, విద్యుత్ సమస్యలు రైతులకు కంటి మీద కునుకు చేస్తున్నాయి. మోత్కూరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని బుజిలాపురంలో ఒక 132/33 కేవీ సబ్ స్టేషన్, మోత్కూరు మండలంలోని మోత్కూరు, అనాజిపురం, పాలడుగు, ఆత్మకూరు(ఎం) మండలంలో ఆత్మకూరు(ఎం), ఖప్రాయపల్లి, పల్లెర్ల, అడ్డగూడూరు మండలంలో అడ్డగూడూరు, అజీంపేట, చిన్న పడిశాల, గట్టుసింగారం, గుండాల మండలంలో గుండాల, పెద్దపడిశాల, అంబాల, సుద్దాల, వెల్మజాలలో 33/11కెవీ విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. కానీ.. లో ఓల్టేజీ, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇంగీసమ్మకుంట పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ పదే పదే ట్రిప్ అవుతున్నదని తెలిపారు. కరెంట్ సమస్యల కారణంగా పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. ఈ విషయమై మోత్కూరు ట్రాన్స్‌కో ఏడీఈ బాలునాయక్‌ను వివరణ కోరగా, ఇప్పటికే పలు సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలను గుర్తించి రిపేర్ చేశామని, ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే గ్రామాల్లోని తమ సిబ్బంది దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు.
రాజాపేట మండలంలో…
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల సబ్ స్టేషన్ పరిధిలోని గోధుమకుంట ఫీడర్‌లోని 100 హెచ్‌పీ ట్రాన్స్ఫార్మర్ కింద 15 బోరు మోటార్ల కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఫీడర్ లో తరుచూ లో ఓల్టేజీ సమస్య ఏర్పడుతున్నది. దాంతో బోర్ల నుంచి నల్లా మాదిరి సన్నటి ధారగా వస్తున్నాయి. ఫలితంగా పొలాలు పారక వరి పంటలు ఎండిపోతున్నాయి. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురానికి చెందిన రైతు జంగిటి బాలయ్య రాజాపేట మండల పరిధిలోని సోమవారం పరిధిలో ఒక బోర్ల కింద నాలుగెకరాలు వరి సాగు చేశారు. కరెంట్ లో ఓల్టేజీతో కారణంగా మోటార్లు నడవక పొట్ట దశలో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులను పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు.
లో ఓల్టేజీతో మోటార్లు కాలుతున్నయ్
పల్లెర్ల సబ్ స్టేషన్ పరిధిలో లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు తరుచూ కాలి పోతున్నాయి. దాంతో పంటలకు నీటి సమస్య ఎదురతున్నది. రిపేర్‌కు డబ్బులు ఖర్చవుతున్నాయి. సమస్యను అధికారులు దృషికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తేనే పంటలు దక్కుతాయి.
-కోరె భిక్షపతి, రైతు, ఆత్మకూరు(ఎం)
కాలిన మోటార్లు రోజుకు మూడు, నాలుగు వస్తున్నయ్
త్రీఫేస్ కరెంట్ సరిగ్గా సరఫరా వల్లే మోటార్లు కాలిపోతున్నాయి. ఒక్క ఫేస్‌లో కరెంట్ తక్కువ సరఫరా కావడం వల్ల మోటార్లు వెడేక్కి రిపేర్‌కు వస్తున్నాయి. ఇలా కాలిన మోటార్లు రోజుకు మూడు, నాలుగు వస్తున్నాయి.
-చెరుకు రాములు, మోటార్ మెకానిక్, మోత్కూరు