గుండాల, మే 5: రైతుల పంటల వివరాల ను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేయకపోవడంతో రైతులు ధాన్యం అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని మరిపడిగ ఏఈవో రామ్‌సింగ్ పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో రైతులు తమ ధాన్యా న్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లగా రైతులకు సంబంధించిన క్రాప్ బుకింగ్ వివరాలు ట్యాబ్‌లో రాకపోవడంతో ధా న్యం కొనుగోళ్లలో ఆటంకం ఏర్పడింది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. మరిపడిగలో సుమారుగా 300 మంది రైతులకు గాను ఏఈవో రామ్‌సింగ్ కేవలం 80 మం ది రైతులకు సంబంధించిన క్రాప్ బుకింగ్ వివరాలనే ఆన్లైన్లో నమోదు చేశారు.
అందులోనూ 10 ఎకరాలు ఉన్న రైతుకు సైతం ఏఈవో 1 గుంట, 2 గుంటలు, 5 గుంటలుగా నమోదు చేశారు. దీంతో రైతు లు తమ ధాన్యం విక్రయించలేకపోతున్నారు. కొందరు రైతులు ధాన్యాన్ని సుమా రు నెల రోజులుగా కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఎండబెట్టి, ఎప్పుడు తూకం వేస్తారో అని ఎదురుచూపులు చూస్తున్నారు. మరికొంత మంది రైతులు చేసేదేమీ లేక ధాన్యా న్ని దళారులకు అమ్ముకుంటున్నారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు నిర్వాహకులను అడిగితే ధాన్యం తూకం వేసి పంపిస్తాం కానీ.. డబ్బులు రాకుంటే మమ్మల్ని అడగొద్దు అంటూ బదులిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఈ విషయంపై ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులను వివరణ అడిగితే కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతు వివరాలను తాము ట్యాబ్‌లో నమోదు చేసే సమయం లో క్రాప్ బుకింగ్ వివరాలు చూపించడం లేదని, ఆన్లైన్లో రైతుల వివరాలు లేకపోవడం వల్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సమాధానం ఇస్తున్నారు. గతంలో ఏఈవోలు క్రాప్ బుకింగ్ చేయకపోతే, నమోదు చేయని రైతుల వివరాలను, తాము కూడా నమోదు చేశామని, అయితే ప్రస్తుతం క్రాప్ బుకింగ్ ఆన్లైన్ సైట్‌ను ప్రభుత్వం మూసివేయడం వల్ల తిరిగి నమోదు చేయడం కుదరని చెబుతున్నారు.
పలువురు రైతులు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ను కలిసి మెరపెట్టుకున్నా ఫలితం లేదని, ఆయన కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తక్షణమే క్రాప్ బుకింగ్ నమోదు చేసి తమ ధాన్యాన్ని తూకం వేయాలని మరిపడిగ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
విధి నిర్వహణలో అలసత్వం వహించిన గుండాల మండలం సీతారాంపురం క్లస్టర్ ఏఈవో మాలోత్ రామ్సింగ్ను యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెండ్ చేశారు. మరిపడిగ గ్రామానికి చెందిన రైతుల పంటల సాగు వివరాలను ఏఈవో రామ్‌సింగ్ ఆన్లైన్లో నమోదు చేయలేదు. దీంతో మరిపడిగ రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు ట్యాబ్‌లో రైతుల వివరాలు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో కలెక్టర్ అనురాగ్ జయంతి రామ్సింగ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.