Kaleshwaram | సూర్యాపేట, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఈ యాసంగికి కాళేశ్వరం జలాలు వచ్చేనా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేనా అని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిసెంబర్ తొలి వారంలోనే నీటి విడుదలపై షెడ్యూల్ ఖరారయ్యేది. షెడ్యూల్ ప్రకారమే కాకుండా పంట చేతికి వచ్చేంత వరకు, రైతులు నీటి విడుదల నిలిపివేయాలని కోరేంత వరకు విడుదల చేశారు. ఈ సారి ఇప్పటికీ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు కాకపోవడం పట్ల జలాలు వస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నీటి నిర్వహణ లోపంతో పంటలు ఎండబెట్టగా ఈ సారి పరిస్థితి ఎలా ఉంటోందోనని రైతులు అయోమయానికి గురవుతున్నారు.
స్వరాష్ట్రంలో గత పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలతోపాటు రైతన్న బలపడ్డాడు. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకోని పంట భూములకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేశారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లా పరిధిలోని 2.95 లక్షల ఎకరాల శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు గత ఉమ్మడి రాష్ట్రంలో పీడకలగా ఉండగా కాళేశ్వరం జలాలు రావడంతో తలెత్తుకొని ధైర్యంగా సంతోషంగా జీవనం సాగించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన తొలి యాసంగికి కాళేశ్వరం జలాలు రాకపోవడంతో వరి పంట ఎండి పోయింది. దీంతో దాదాపు పదేండ్ల తరువాత ప్రభుత్వంపై రైతన్నలు ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలు పునరావృతం అయ్యాయి. ఇప్పుడిప్పుడే రైతన్నలు వానకాలం పూర్తి చేసుకొని యాసంగి కోసం దుక్కులు దున్నుతుండగా నీళ్లు వస్తాయా లేదోనని ఎదురుచూస్తున్నారు.
నీటి విడుదల షెడ్యూల్ కోసం ఎదురుచూపు
ఈ యాసంగికి శ్రీరాంసాగర్ ఫేజ్ 2 ఆయకట్టు పరిధిలోని సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు ఇచ్చేందుకు ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాకపోవడం పట్ల రైతులు అయోమయంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో యాసంగికి డిసెంబర్ తొలి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి గోదావరి జలాలను నిరంతరాయంగా విడుదల చేసేది. దాదాపు మూడు నెలలు అంటే 85 నుంచి వంద రోజులపాటు సీజన్‌కు 30 నుంచి 40 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేయగా జిల్లాలోని 2.95లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. ప్రస్తుతం వానకాలం సీజన్ పూర్తవుతుండగా యాసంగి కోసం ఇప్పుడిప్పుడే రైతులు దుక్కులు దున్నుతున్నారు. గత యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ లోపమో లేక కావాలని చేసిందో కానీ కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. దీంతో ఈ యాసంగికి కాళేశ్వరం జలాలు వస్తాయా రావా అనే రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒక వేళ నీటిని విడుదల చేయదల్చుకుంటే షెడ్యూల్ విడుదల చేయాలని లేని పక్షంలో నీటి విడుదల ఉండదని ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
పంటకు నీళ్లు అందక గతేడాది నష్టపోయాం
గతేడాది యాసంగిలో 3.15ఎకరాల్లో వరి సాగు చేసిన. సకాలంలో కాళేశ్వరం నీళ్లు అందించకపోవడంతో పంట మొత్తం ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం. ఈ సారైనా అధికారులు స్పందించి సకాలంలో నీళ్లు అందించాలి.
– లకావత్ వెంకన్న, సూర్యనాయక్‌తండా , తుంగతుర్తి
సాగుకు కాళ్వేశ్వరం జలాలు అందించాలి
ఎస్సారెస్పీ కాల్వ నీళ్లపై ఆధారపడి వ్యవసాయ సాగు చేస్తున్నా. గతేడాది ఎస్సారెస్పీ నీళ్లు సకాలంలో రాలేదు. నాలుగు ఎకరాలు ఎండిపోయి పశువులకు మేత పాలైంది. రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగానే నీళ్లను అందించాలి.