కోదాడ, ఆగస్టు 29 : పంటలకు సరిపడా యూరియా లభించని కారణంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ రైతులు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమ ఆవేదనను ఈ విధంగా వెలిబుచ్చారు. కోదాడ, హుజూర్నగర్ నియోజక వర్గాలకు చెందిన రైతులమైన తాము యూరియా దొరకక సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తూ అరిగోస పడుతున్నాం. ఇప్పటికే రెండు నియోజక వర్గాల్లో సగానికి పైగా భూముల్లో వరినట్లు పడ్డాయి. దీంతో పాటు ఇతర పంటలు ఏపుగా పెరిగేందుకు యూరియా చల్లాల్సి ఉంది. అయితే సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో వేసిన పంటలు నాశనమైతే అప్పులపాలు కావాల్సి వస్తుంది. ప్రతి అసెంబ్లీ ఎన్నికలప్పుడు తమరు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే మా పిల్లలు.. వారి బాగోగులు చూసుకోవడమే మా లక్ష్యం… మా జీవితాలు వారికే అంకితం అంటుంటారు. తమరు అన్నది వాస్తవమే కదా.. కోదాడ నుంచి తమరిని రెండు విడతలు, హుజూర్నగర్ నుంచి మూడు విడతలు వెరసి ఐదుసార్లు మెజారిటీతో గెలిపించాం.
ఇక తమరి సతీమణి పద్మావతమ్మను కోదాడ నుంచి రెండుసార్లు గెలిపించిన విషయం తమరికి విధితమే. ఇక్కడి నుండి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రెండు నియోజకవర్గాల రైతులమైన తాము పాఠశాలకు వెళ్లే పిల్లగాళ్లతో కలిపి కుటుంబ సభ్యులమంతా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ఎదుట పడికాపులు కాస్తున్నాం. అయితే ఎకరానికి ఒక బస్తా అంతకన్నా ఎక్కువ ఉంటే రెండు బస్తాలు మాత్రమే యూరియా సరఫరా చేయడం వల్ల ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొన్నది. ఇక కొన్ని సొసైటీల ఎదుట నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూ లైన్లో ఉంచాల్సి వస్తుంది. ఈ దుస్థితి ఈ రెండు నియోజకవర్గాలలోనే కాదు జిల్లా వ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి ఇలాగే ఉన్నది. పరిపాలన దక్షత ఉన్న జిల్లా మంత్రిగా ఔదార్యంతో పెద్ద మనసు చేసుకుని అవసరానికి సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
Kodada : అమాత్యా.. మా అరిగోస ఆలకించండి..!