యాదాద్రి భువనగిరి, జూన్ 26(నమస్తే తెలంగాణ): ఆరుగాలం కష్టించి పంట పండించే రైతుల కడుపు కొట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభు త్వం పూనుకున్నది. వాన కాలం రైతు భరోసా అమలులో జమ్మిక్కులు చేస్తున్నది. పెట్టుబడి సాయంలో భారీగా కోతలు విధిస్తున్నది. అనేక మంది రైతుల ఖాతాల్లో అసలు కంటే తక్కువ గా డబ్బులు జమ చేస్తున్నది. ఇంకొంత మం దికి అసలే వేయడం లేదు. దీంతో చేసేదేం లేక రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఏ సీజన్లోనూ సక్రమంగా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో 2024లో పెట్టుబడి సాయం పెంచకుండానే ఖాతాల్లో డబ్బులు చేసింది.
ఆ తర్వాత వానకాలం సీజన్ మొత్తానికి ఎగనా మం పెట్టింది. యాసంగిలో పూర్తిస్థాయిలో వేయకుండా చేతులు దులుపుకొంది. ఇంకా 52వేల మందికి రైతు భరోసా రావల్సి ఉంది. ఇప్పుడు వానకాలంలో కూడా సరిగ్గా డబ్బు లు వేయడం లేదు. డబ్బుల చెల్లింపుల్లో కోత లు పెట్టింది. ఖాతాల్లో డబ్బులను తక్కువగా జమ చేసింది. ఉదాహరణకు.. 2ఎకరాల భూ మి ఉంటే.. కేవలం 20గుంటలకు మాత్రమే డబ్బులు వేసింది. దీంతో రైతులు వ్యవసాయ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. తమకు ఎందుకు రాలేదని ఆరా తీస్తున్నారు. వివరాలు ప్రభుత్వానికి పంపించామని, తమకేం తెలియదని కొందరు అధికారులు చెబుతుండగా, మరికొందరు మాత్రం సాగు చేయకపోతే రాదని స్పష్టం చేస్తున్నారు. సాగు చేస్తున్న అనేక మంది రైతులకు సైతం డబ్బులు జమ కాకపోవడం విశేషం.
కొందరికి అసలే రాలే..
ఓ వైపు కోతలు పెడుతుండగా, మరోవైపు కొం దరికి అసలే రైతు భరోసా డబ్బులు జమ కాలే దు. ఈ సీజన్లో 2.84 లక్షల మంది రైతులకు రూ. 317 కోట్లు జమ చేయాలని వ్యవసాయ అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు 2.33లక్షల మందికి రూ.306 కోట్ల డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు. భువనగిరి మండలంలోని మన్నెవారిపంపులో బోయిని మల్లేశ్ అనే రైతుకు 1.22 గంటల భూమి ఉండగా, అర ఎకరంలో సన్న వడ్లు వేశారు.
కానీ ఒక్క పైసా కూడా ఖాతాలో జమ కాలేదు. అదే గ్రామానికి చెందిన బోయిన లతకు ఎకరం 20గుంట లు ఉండగా పెట్టుబడి సాయం పత్తాలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు రైతులపై ఉన్న చిత్తశుద్ధి ఇదే అని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందింది. యాదా ద్రి జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సీజన్లు కలుపుకొని 2,508 కోట్లను 2,33,461 మం ది రైతు ఖాతాల్లో సాయం జమ చేసింది.
సాగు భూములకే రైతు భరోసా..
జిల్లాలో కొందరికి రైతు భరోసా డబ్బులు తక్కువగా జమ అయినట్లు మా దృష్టికి వచ్చింది. సాగులో ఉన్న వాటికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది. దాని ప్రకారమే సర్కారు డబ్బులు జమ చేస్తుంది. అయితే సాగులో ఉన్న భూములకు కూడా సాయం అందకపోతే పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తాం.
– గోపాల్, డీఏవో, యాదాద్రి భువనగిరి
ఈ ఫొటోలోని రైతు పేరు చిలుకూరి నర్సిరెడ్డి. భువనగిరి మండలంలోని మన్నెవారి పంపు గ్రామం. ఎకరం 38గుంటల భూమి ఉంది. గతంలో మొత్తం భూమికి డబ్బులు ఖాతాలో జమ అయ్యేవి. కానీ వానకాలం సీజన్‌కు సంబంధించి కేవలం రూ.300 మాత్రమే జమఅ య్యాయి. అంటే కేవలం రెండు గుంటలకు మాత్రమే డబ్బులు పడినట్లు తెలుస్తున్నది. ఇదే విషయమై స్థానికి వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించగా తమకేం తెలియదని సమాధానమిచ్చారని ఆయన వాపోయారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న అన్నదాత పేరు బీసు భాస్కర్. నివాసం మోత్కూరు. పాస్ బుక్ ప్రకారం మూడు ఎకరాల 21 గుంటల భూ మి ఉంది. దీని ప్రకారం 21,150 పెట్టుబడి సాయం జమ చేయాలి. కానీ ఆయన ఖాతాలో 18,750 మాత్రమే వేశారు. 16గుంటలకు అంటే రూ. 2400 తక్కువగా రైతు భరోసా డబ్బులు పడలేదు. ఇలా జిల్లాలో అనేక మందికి డబ్బులు జమ చేయకుండా ప్రభుత్వ మాయ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.