కొండమల్లేపల్లి, మే 25 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడుతున్న రైతును రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిట్టనిలువునా దోచుకుంటున్నారు. సెంటర్లలో ధాన్యం తూకం వేసిన తర్వాత ఇస్తున్న దుడువాయి తూనికపట్టి (స్లిప్), ధాన్యం కొనుగోలు రిజిస్టర్లో బస్తాల నమోదు, దిగుమతి సమయంలో రైస్ మిల్లుల్లో నమోదు చేసే ట్రక్షీట్కు భారీ తేడా ఉంటోంది. బస్తాలకు బస్తాలే మాయమవుతున్నాయి. సెంటర్లలో ధాన్యం తూకం, మిల్లుల్లో బస్తాలు దిగుమతి చేసే వరకు తరుగు, తాలు, మట్టి, తడిసిన ధాన్యం నెపంతో రైతుల కష్టాన్ని అందరూ కలిసి వాటాలుగా పంచుకుంటున్నారు. ఇదంతా రైతులకు ఏ మాత్రం తెలియకుండా కోతలు పెడుతూ సైలెంట్‌గా స్వాహా పర్వానికి తెరలేపారు. సెంటర్లకు ధాన్యం తెచ్చిన దగ్గర నుంచి తూకం వేసి కేటాయించిన మిల్లులకు తరలించి దిగుమతి చేసుకునే వరకు అంటే తక్‌పట్టీ నుంచి ట్రక్‌షీట్ నమోదు వరకు ప్రభుత్వం రైతులనే బాధ్యులను చేసింది. సెంటర్లలో ఒక్కో రైతు 20 నుంచి 30 రోజులకుపైగా పడిగాపులు కాసి అధికారులు, నిర్వాహకుల కాళ్ల్లావేళ్లా పడి గన్నీ బ్యాగులు తెచ్చకుంటున్నారు. ధాన్యం తూకం వేయడానికి హమాలీలు కుప్పకు వెయ్యి తీసుకుంటున్నా రైతులు చేసేది లేక సరే అంటున్నారు.
బస్తాకు 40.700 కిలోలకు బదులు 42 కిలోల తూకం వేయడం, లారీ యజమానులు బస్తాకు రూ.2 చొప్పున ఇవ్వాలని లేకుంటే ధాన్యం తీసుకెళ్లమని కొర్రీలు పెడుతున్నారు. ఇన్ని కష్టనష్టాలను భరించి ధాన్యం బస్తాలను మిల్లుల్లో దిగుమతి చేసుకున్న తర్వాత రైతుకు తెలియకుండానే ట్రక్‌షీట్ నమోదులో బస్తాల సంఖ్యను తక్కువ చూపుతున్నారు. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతుల కష్టాన్ని ఎలా దోచుకుంటున్నారో కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల సమీపంలో బాబ్లతండా వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకంతో తూకంలో వచ్చిన లేడాలే ఇందుకు నిదర్శనం. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేరుతో ఐకేపీ నిర్వాహకులు ఈ నెల 5న బస్తాకు 42 కిలోల తూకంతో మొత్తం 747 బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డ్ బక్కులో నమోదు చేశారు. తక్‌పట్టీ ఇవ్వలేదు. తక్‌పట్టీ అడిగితే బుక్కులో ఎంట్రీ చేశాం కదా తక్‌పట్టీ ఎందుకని ఇవ్వలేదు. ఈ నెల 11న మండలంలోని చిన్నఅడిశర్లపల్లి సమీపంలో గల శ్రీసాయి వెంకటేశ్వర రైస్ మిల్లులో ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకున్న తర్వాత ట్రక్‌షీట్ నంబర్ 7142తో మరోసారి నమోదు చేసిన బస్తాల తూకం కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి రైతు సంబంధించిన 747 బస్తాలకు బదులు 718 బస్తాలుగా అంటే 29 బస్తాలను రైతుకు చెప్పకుండానే కోత పెట్టి ఆయన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు.
తక్కువ డబ్బులు రావడంతో అనుమానంతో రైతు మిల్లుల్లో ఉండే ఐకేపీ నిర్వాహకులను ప్రశ్నించారు. ‘మీ ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందట. అందుకే తూకంలో 29 బస్తాలు ధాన్యం కోత పెట్టినం’ అని సమాధానం చెప్పారు. సెంటర్లోనే ధాన్యం ఆరబోసి 20 రోజుల తర్వాత 13 మాయిశ్చర్ (తేమ)లో యంత్రం ద్వారా తాలు, మట్టి లేకుండా నూర్పిడి చేసి ఇచ్చానని, అందుకు దాదాపు రూ.5 వేల వరకు ఖర్చు అయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తరుగు తీసి… మళ్లీ మిల్లులో తరుగు ఎందుకు తీశారని నిలదీసినా ఫలితం లేకుండా పోయింది. రైతులకు దడువాయి తక్‌పట్టీ ఇవ్వకుండా రికార్డులో ఎంట్రీ మాత్రమే చేస్తున్న నిర్వాహకులు మిల్లులో చివరి నమోదు ట్రక్‌షీట్ ఇవ్వడం లేదు. కావాలని అడిగిన రైతులకు సైతం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. గొడవపడితే తమ ఖాతాలో డబ్బులు వేయకుండా కొర్రీలు పెడతారనే భయంతో రైతులు రెక్కల కష్టం పోతేపోనీలే అని సరిపెట్టుకుంటున్నారు. రైతులకు తెలియకుండా ఈ దందా చేస్తున్న సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యం తక్‌పట్టీ ఇవ్వకుండా బుక్కులో ఎంట్రీ చేస్తున్నారని, మిల్లర్లు తక్కువ ధాన్యం కొనుగోలు చేసిన ట్రక్‌షీట్ నమోదు చేసి ఇస్తూ మాయ చేస్తున్నారు. తక్‌పట్టీ తూకానికి, బ్యాంక్ అకౌంట్లో జమైన మొత్తానికి తేడా ఉండటాన్ని అమాయక రైతులు గమనించడం లేదు. ఒకవేళ తేడా గుర్తించినా బ్యాంకులో ఏమైనా చార్జీలు మినహాయించారనే భావనతో రైతులు ఎవరనీ ప్రశ్నించడం లేదు.
దేవరకొండ నియోజకవర్గం పరిధిలో 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 7,403 రైతుల నుంచి 4,28,291.48 క్వింటాళ్ల(42 వేల మెట్రిక్ టన్నులు) ధాన్యం కొనుగోలు చేశారు. 6,467 మంది రైతులకు రూ.116 కోట్ల 42 లక్షల 30 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 4,246 మంది రైతులకు చెందిన దాదాపు 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలుగా దర్శనమిస్తోంది. మూడు రోజుల నుంచి అక్కడక్కడా వర్షాలు పడుతుండటంతో రైతులు దిగులుపడుతున్నారు. వర్షంలో ధాన్యం తడిస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని, అధికారులు స్పందించి త్వరగా కాంటా వేసి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులకు కన్నీరే మిగులుతోంది. రెండున్నరేండ్లల్లో అడుగడుగునా అన్నదాతలకు ఇక్కట్లే దావురిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నెలలతరబడి రైతులు సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదు. హమాలీలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండటం లేదు. కల్లాల్లో ధాన్యం నిలిచిపోతోంది. నాలుగైదు కిలోల తరుగు తీస్తున్నారు.లేదంటే లారీల్లోని ధాన్యం బస్తాలను దించుకునేందుకు ససేమిరా అంటున్నారు. లారీ యజమానులు సైతం సంచికి రూ.4 వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కేసీఆర్ పాలనలో రెవెన్యూ, వ్యవసాయం, పోలీసు, రవాణా, పౌరసరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి, సహకార శాఖల మధ్య సమన్వయం ఉండేది. నేడు శాఖల మధ్య పరస్పరం అవగాహన లోపించింది. ఏ రైతును కదిలించినా.. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని, నేడు కష్టాలు పడుతున్నామని నిట్టూరుస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఇటీవల కొండమల్లేపల్లి చౌరస్తాలో ధాన్యం తగులబెట్టి రైతులు మహాధర్నా, రాస్తోరోకో చేపట్టినా ధాన్యం సేకరణ వేగంగా సాగడం లేదు.
నా నాలుగు ఎకరాలతో పాటు మ రో పది ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. 747 క్వింటాళ్ల ధాన్యం పండింది. తాలు పేరుతో శ్రీసాయి వెంకటేశ్వర రైస్‌మిల్లులో మోసం చేస్తున్నారు. క్వింటాల్‌కు 5 కిలోల తరగు తీస్తేనే అన్లోడ్ చేస్తామని మొండికేశారు. వాహనం అద్దె భారం మోయలేక చేసేదేమీలేక వారి దోపిడీకి తలవంచాల్సి వచ్చింది. తరుగు పేరుతో 29 బస్తాల ధాన్యం మాయం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయా న్ని పండుగగా మార్చారు. కాంగ్రె స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దండుగైంది. నేడు రైతులకు అన్నీ కష్టాలే. సమయానికి యూరియా దొరకలేదు. ధాన్యం అమ్ముకోవడానికి కష్టపడాల్సి వస్తున్నది. చిన్నఅడిశర్లపల్లి సెంటర్‌కు వడ్లు తెచ్చి 25 రోజులైంది. మాయిశ్చర్ వచ్చి వారమైనా బస్తాలు ఇస్తలేరు. కాంటా చేస్తలేరు. మా బాధలు పగోనికి కూడా రావొద్దు.
కాంగ్రెస్ పాలనలో పంట అమ్ముకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తున్నది. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులైంది. తేమ శాతం వచ్చి వారం రోజులైనా ఇప్పటికీ సంచులు ఇస్తలేరు. కాంటా పెడ్తలేరు. ఈ ఎండలకు వడ్లు మొత్తం ఎండిపోతున్నాయి. మహిళలకు మస్తు తిప్పలైతాంది. రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ఎప్పటికీ బాగుపడడు.