మోత్కూరు, జూన్ 4: బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు పాల శీతలీకరణ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ప్రధాన గేటుకు బుధవారం తాళం వేసి రైతులు నిరసన తెలిపారు. నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మదర్ డెయిరీ పరిధిలో సుమారు 300 పైచిలుకుగా పాల ఉత్పత్తి సేకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో రోజూ 65 వేల మంది రైతులు సేకరణ కేంద్రాలకు పాలు పోస్తున్నారు.
గత మార్చి నుంచి పాడి రైతులకు ఆరు బిల్లులను రూ.35.10కోట్లు చెల్లించాల్సి ఉన్నది. రోజులు గడుసున్నా బకాయిలను చెల్లించక పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ తీసుకుని బకాయిలు ఇప్పించాలని మండలంలోని ముశిపట్ల పాల ఉత్పత్తి సేకరణ కేంద్రం సొసైటీ ఆధ్వర్యంలో రైతులు స్థానిక కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళన చేశారు.
మదర్ డెయిరీ చైర్మన్ జీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ తమకు బకాయిలు చెల్లింపు కోసం హామీ ఇస్తే తప్పా గేటు తాళం తీయబోమంటూ నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. రైతులకు చెల్లించే మూడు నెలలకు చెందిన ఆరు బకాయిలు రూ.7.20 లక్షలు ఉన్నాయనీ.. వాటిని దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ముశిపట్ల సొసైటీ చైర్మన్ పైళ్ల పెద్ద కవిత, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పైళ్ల చిన్నవెంకట్‌రెడ్డి, పాపిరెడ్డి, నర్సిరెడ్డి, తండా వీరస్వామి, వల్లపు అంతయ్య, కందుల యాదయ్య, పైళ్ల సత్తిరెడ్డి, చెబెల్లి సైదులు, జెట్ట కిష్టయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
రాస్తారోకో
రాజాపేట, జూన్ 4 : పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మదర్ డెయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సందిల భాసర్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాజాపేట పాల శీతలీకరణ కేంద్రం ఎదురుగా మండల పాల సొసైటీ చైర్మన్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు ఓపికతో సహనంతో మదర్ డెయిరీ పైన ఉన్న నమ్మకంతో నెలల తరబడి పాల బిల్లులు చెల్లించకపోయినా ఊరుకున్నామని, కానీ తమ సహనాన్ని చేతగానితనంగా భావించి పాడి రైతును గోస పెట్టడం సరికాదన్నారు.
ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి నియోజవర్గ పర్యటనలో భాగంగా విజయ డెయిరీకి నిధులు ఇచ్చిన విధంగా మదర్ డెయిరీకి కూడా నిధులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకొని సీఎం నోట మదర్ డెయిరీని ఆదుకుంటామనేస్పష్టమైన హామీని ఇచ్చే విధంగా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల సొసైటీ చైర్మన్లు ఎడ్ల సత్తిరెడ్డి రామిడి బాపురెడ్డి, మల్లారెడ్డి మహేందర్ రెడ్డి, భూపాల్, బాలయ్య, రాజు బ్రహ్మయ్య, నర్సింలు, బాబు, సిద్ధులు పాడి రైతులు పాల్గొన్నారు.