నల్లగొండ ప్రతినిధి, జూలై16(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దే అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేటి నుంచి రైతు సమావేశాలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అన్ని రైతు వేదికల వద్ద వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నదని ఇందులో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఉన్న 95 శాతం మంది రైతన్నలకు మూడు గంటల కరెంట్ సరఫరా చాలు అంటూ ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఅర్ఎస్ పార్టీ ఈ సమావేశాలను ఉపయోగించుకోనున్నది.
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దు చేస్తుందన్న మాటను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లనున్నది. బీఆర్ఎస్ పార్టీ మూడు పంటలు కావాలా.. కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంట్ కావాలా..? అన్న నినాదంతో కదం తొక్కాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దవుతుందనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా నేటి నుంచి పది రోజులపాటు రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులతో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు జరుగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయనున్నారు. ఎకరానికి గంట విద్యుత్ సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే అని, వారు వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సమావేశాల్లో తీర్మానం చేయనున్నా రు. కటిక చీకట్ల కాంగ్రెస్ పార్టీ కావాలా, రైతు జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా అంటూ రైతులను కోరనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 17 నుంచి 27 వరకు రైతు వేదికల వద్ద ఎమ్మెల్యేల పర్యవేక్షణలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సమావేశాలకు రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్ల కాలంలో వ్యవసాయ రంగానికి కనీవినీ ఎరుగని రీతిలో నిధులు కేటాయించిందని తెలిపారు. నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాలు, సాగునీరు ఇలా అన్నింటినీ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని పేర్కొన్నారు. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలకు నీరిచ్చే బీఆర్ఎస్ కావాలా అనే విషయాన్ని రైతు సమావేశాల్లో చర్చకు పెట్టాలన్నారు. సాగుకు కరెంట్‌పై కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానాలు ఆమోదించాలని సూచించారు.