మునుగోడు, సెప్టెంబర్ 13 : రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తూ రైతుబంధు, రైతుబీమా వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ వంటి రైతుబాంధవుడే దేశానికి నాయకత్వం వహించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమం ద్వారా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి 8ఏండ్లలోనే తెలంగాణను చూసి దేశమంతా నేర్చుకునేలా అభివృద్ధి చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ పార్టీ పెట్టి భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ను టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున కోరినట్లు తెలిపారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలతోపాటు 24 రాష్ర్టాల రైతుసంఘాల ప్రతినిధులు సైతం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు.
తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను విజయవంతంగా అమలు చేసి చూపించారని, అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు, జీఎస్టీ పెంచడంతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక మోదీ పాలన పోవాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అన్నారు. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన నూతన విద్యుత్ బిల్లు అమల్లోకి వస్తే ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని, తెలంగాణలో 35లక్షల మంది మోటర్లకు మీటర్లు వస్తాయని తెలిపారు. ప్రధాని మోదీకి తెలంగాణ అంటే కోపమని, తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఆయన తప్పుపట్టారని గుర్తుచేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.30వేల కోట్ల కోసం ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఇవ్వడం లేదన్నారు.
పార్లమెంటులో తాము కొట్లాడుతుంటే తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు ఒక్కరూ మాట్లాడలేదని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో సుమారు లక్ష మందికి రైతుబంధు, 40వేల మందికి పింఛన్లను టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్నదని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను మోసం చేసి.. తన వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరిన రోజే రాజగోపాల్‌రెడ్డి ఓటమి ఖరారైందని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి భరతం పట్టేందుకు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డిపై కసితో రగిలిపోతున్న కాంగ్రెస్.. తమ పార్టీ గెలవకున్నా బీజేపీ ఓడిపోవాలని భావిస్తున్నదని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి, ఈద నిర్మల పాల్గొన్నారు.