సంస్థాన్ నారాయణపురం, ఫిబ్రవరి 20: ‘నాకు చదువు రాదు. ఓటీపీ అంటే ఏమిటో తెలుస్త్తలేదు. ఫోన్లో యూరియా బుక్ చేయడం నాకు వస్త్తలేదు. కష్టపడి పండించిన పంట కండ్ల ముందు నాశనం అవుతోంది. ఒక్క యూరియా బస్తా కూడా దొరుకుత లేదు. యూరియా కష్టాలు చూస్తుంటే కండ్లల్లో నెత్తురు కారుతోంది. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నది’ అని రైతు దామోదర్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదువురాని, ఫోన్లు వాడటంరాని రైతులకు ఫర్టిలైజర్ యాప్ శాపంగా మారింది.
సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ యూరియా కోసం అన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేశారు. అక్కడికి వచ్చిన రైతు దామోదర్‌రెడ్డికి ఓటీపీ రాకపోవడం.. ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడంతో యూరియా దొరకక తీవ్ర నిరాశకు గురయ్యాడు. నాలుగు రోజుల నుంచి వచ్చిపోతున్నా ఒక్క యూరియా బస్తా ఇవ్వడం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనులు మూసి తెరిచేలోపే యూరియా స్టాక్ అయిపోతోందని, ఒక్క యూరియా బస్తా అందించలేని ప్రభుత్వం ఉండటం రైతులు చేసుకున్న దౌర్భాగ్యమని దుమ్మెత్తి పోశాడు. యూరియా కోసం పడరానిపాట్లు పడుతున్నామని రైతులు వాపోయారు. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
గుజ్జ, సంస్థాన్ నారాయణపురం గ్రామాల్లోని పీఏసీఎస్‌లో ఒక్కో యూరియా బస్తాకు రూ.266 తీసుకుంటున్నారు. సర్వేల్ గ్రామంలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలో మాత్రం బస్తాకు రూ.280 వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. పీఏసీఎస్‌లో ధర ప్రకారం తీసుకోవాలని అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. సెంటర్ నిర్వాహకులు రూ.వంద తీసుకుని యూరియా బుక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారి పూజను వివరణ కోరగా యూరియా బస్తాకు రూ.266 మాత్రమే తీసుకోవాలని, ఒక్క రూపాయి ఎక్కవ తీసుకున్నా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.