నేరేడుచర్ల, మార్చి 21 : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రైతు కూలీలకు ఎదురుచూపులు తప్పడం లేదని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ అన్నారు. నేరేడుచర్ల మండల పరిధిలోని జానల్ దిన్నె గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించిందన్నారు. పథకాన్ని ఆరంభించి నెలలు గడుస్తున్నప్పటికీ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతు కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించడంలో ఎలాంటి మెలికలు పెట్టకుండా అందరికీ అందించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ యాంత్రీకరణ నేపథ్యంలో అనేకమంది వ్యవసాయ కూలీలు గ్రామాల్లో ఉపాధి దొరకక, అలాగే పిల్లల చదువుల కోసం దగ్గరలో ఉన్న పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి మురికి వాడల్లో నివసిస్తూ అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్లుగా, హోటళ్లలో సర్వర్లుగా, అపార్ట్మెంట్ల ముందు సెక్యూరిటీ గార్డ్ గా జీవనం వెళ్లదీస్తున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం లేకపోవడం వల్ల వారికి జాబు కార్డులు లేకుండా పోయాయని, కేవలం జాబ్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోందన్నారు. దానివల్ల పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యవసాయ కూలీలకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకుడు జిలకర రామస్వామి, మాజీ ఎస్ఎంసీ డైరెక్టర్ రమావత్ అశోక్ నాయక్, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు లంకెపల్లి నాగార్జున పాల్గొన్నారు.