కట్టంగూర్, అక్టోబర్ 25 : కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తప్పుడు తూకాలతో రైతులను మోసం చేస్తున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి ఆరోపించారు. శనివారం మండలంలోని ఈదులూరు, కల్మెర, అయిటిపాముల కట్టంగూర్ లోని పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలకు కేంద్రాల్లోని ధాన్యం తడిచి రైతులు అరిగోస పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
కేంద్రాల్లో పట్టాలను అందుబాటులో ఉంచకపోవడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పిండంలో అధికారులు విఫలమైయ్యారని ఆరోపించారు. తడిచిన వడ్లు ఆరబెట్టేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నా, సంబంధిత అధికారులు కేంద్రాలను సందర్శించడం లేదన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేసి అకాల వర్షానికి కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి సన్నాలకు రూ.500 బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గజ్జి రవి, బిరెడ్డి సత్తిరెడ్డి, అంబటి వెంకటేశం, కొండి యాదగిరి రెడ్డి, మామిడి ఎల్లయ్య, గజ్జి మల్లయ్య, బూరుగు సత్తయ్య, బీవీ. చారి, వెంకటయ్య, మల్లమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.