వానకాలం ముగిసి శీతాకాలం షురూ కావడంతో జిల్లాలో చలి క్రమంగా పెరుగుతున్నది పగలు కాస్త పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ సాయంత్రం కాగానే దాని తీవ్రత ఎక్కువ అవుతున్నది. చీకటి పడగానే షురూ అవుతున్న చలి ప్రభావం తెల్లారే సరికి కూడా గజ గజ వణికిస్తున్నది. దీంతో ప్రజలు పొద్దుగూకాలే దుప్పట్లల్లో దూరుతూ ఫ్యాన్లు బంద్ చేస్తున్నారు. ప్రధానంగా గడిచిన వారం రోజులుగా ఈ చలి ప్రభావం పెరగడంతో బయటకు వెళ్లాల్సిన జనం జంకుతున్నారు. ఇదిలా ఉండగా నేడో రేపో బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడే ప్రమాదం ఉండటంతో వానకు తోడు చలి ప్రభావం వల్ల ఇంకా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని వాతావరణ శాఖ యంత్రాంగం అంటున్నది.
జిల్లాలో గడిచిన వారం ముందు వాతావరణం కాస్త సరిగ్గానే ఉన్నప్పటికీ ఆ తర్వాత చోటుచేసుకున్న మార్పుల కారణంగా చలి ప్రభావం పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల లోపే నమోదు అవుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు పడిపోయాయి. దాంతో పొద్దుగూకే సరికే చలి ప్రభావం కనిపిస్తుంది. చలి కారణంగా ప్రధానంగా విద్యార్థులు స్కూల్కు వెళ్లేటప్పుడు ఇబ్బందులు పడుతుండగా, వృద్ధులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇక దినసరి కూలీలు, రైతులు, చిరువ్యాపారులు తప్పని పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పనులకు వెళ్తున్నారు.