– నకిరేకల్ పీఏసీఎస్ కేంద్రాల్లో సౌకర్యాలు నిల్
– బుధవారం కురిసిన వర్షానికి 500 బస్తాలకు పైగా ధాన్యం నీళ్ల పాలు
– కంటతడి పెడుతున్న అన్నదాతలు
నకిరేకల్, అక్టోబర్ 09 : నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయని కారణంగా అకాల వర్షాల వల్ల ధాన్యం నీళ్ల పాలవుతోంది. దీంతో రెక్కలు ముక్కలు చేసుకుని పంటను పండించిన రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. బుధవారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి మండలంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 500 బస్తాలకు పైగా ధాన్యం నీళ్లు, మట్టి పాలైంది. గడచిన రెండు వారాలుగా అక్కడక్కడ కురుస్తున్న అకాల వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోతోంది. ఆరబెట్టిన ధాన్యం తడవకుండా ప్రభుత్వం టార్పాలిన్లు అందుబాటులో ఉంచకపోవడంతో దాన్యం తడిసి ముద్దవుతోంది. చేతికొచ్చిన ధాన్యం విక్రయించే సమయంలో నీళ్ల పాలు, మట్టి పాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
నకిరేకల్ మండలంలోని చీమలగడ్డ, మంగళపల్లి, చందుపట్ల, గోరెంకలపల్లి, తాటికల్లు, నెల్లిబండ కేంద్రాలకు గత 20 రోజులుగా రైతులు ధాన్యం తీసుకొస్తున్నారు. 20 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నా రెవెన్యూ అధికారులు గానీ, సివిల్ సప్లై అధికారులు కానీ, పీఏసీఎస్ అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసిన తర్వాత రైతులకు కనీసం నీడ వసతి కూడా కల్పించడం లేదు. ఒక్క సెంటర్ మినహా నాలుగు కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించకపోవడంతో బయట దుకాణాల వద్ద నీళ్ల బాటిల్ కొనుగోలు చేసి దాహం తీర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మహిళలకు తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
నకిరేకల్ పీఏసీఎస్ పరిధిలో చీమలగడ్డ, చందుపట్ల, తాటికల్లు, నెల్లిబండ, చందుపట్ల-2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రైతులకు టెంట్లు, మంచినీళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, కరెంటు సౌకర్యం ఇంకా కల్పించలేదు. రెండు రోజుల్లోగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Nakrekal : తడుస్తున్న ధాన్యం… పట్టించుకోని యంత్రాంగం