తరుగు, తడిసిన ధాన్యం పేరుతో రైతులను అక్రమార్కులు నిలువునా ముంచారు. మిల్లర్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ధాన్యం నొక్కేశారు. గత యాసంగిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2వేల క్వింటాళ్ల దోపిడీ చేశారు. వాటి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. కోత కోసిన ధాన్యాన్ని కొంత మిల్లర్లు కాజేయగా, మిగతా ధాన్యం కేంద్రాల నిర్వాహకులు పలువురు రైతుల పేరిట వేయించుకొని బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ధాన్యం కోతలపై జరిగిన అక్రమాలపై ఎక్కువ మొత్తంలో నష్టపోయిన పలువురు రైతులు గుర్తించి అధికారుల చుట్టూ తిరిగారు. కానీ క్వాంటా, అర క్వింటాలు నష్టపోయిన రైతులు మాత్రం పట్టించుకోలేదు. అన్నీ సక్రమంగా ఉండి కోతలు ఎలా కోస్తారని అధికారులను నిలదీస్తూ పది నెలలుగా పోరాటం చేయగా బుధవారం కొంత మంది రైతులకు కొంత మంది డబ్బులు చెల్లించి, మిగతా వారికి తర్వాత ఇస్తామని చెప్పి అధికారులు చేతులు దులుపుతున్నారు. ప్రధానంగా నల్లగొండ, నకిరేకల్, నియోజకవర్గాల్లో ఈ మోసం ఎక్కువగా జరగ్గా దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడలోనూ పాక్షికంగా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
ధాన్యం మిల్లులకు చేరాక మోసం..
గత యాసంగిలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో 370 కేంద్రాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు సుమారు రూ.1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. కొన్న ధాన్యం లిఫ్టింగ్ చేశాక ధాన్యం తడవడంతో మిల్లర్లు తీసుకోవటం లేదని, కోతలు పెడతున్నారని, లేదంటే మీరే తీసుకొని ఎక్కడికైనా వెళ్లి అమ్ముకొమ్మని నిర్వాహకులు రైతులను భయపెట్టారు. పెద్ద రైతులకైతే క్వింటా నుంచి మూడు క్వింటాళ్ల వరకు, చిన్న రైతులకైతే అర క్వింటా నుంచి క్వింటా వరకు మిల్లుల్లో కోతలు కోశారట. కొంత మంది రైతులు ఏంచేస్తామని మిన్నకుండా ఊరుకోగా, మరికొంది మంది రైతులు అన్నీ సక్రమంగా ఉన్నా కోతలెందుకు కోశారని, తమ ధాన్యం డబ్బులు తిరిగి ఇవ్వాలని పది నెలులుగా సంబంధిత ఆఫీసుల చుట్టు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే కోసిన కోతలో కొంత భాగం మిల్లర్లు తీసుకోగా మరి కొంత భాగం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే వారికి భూములు ఉంటే వారి పేరుతో, లేకుంటే మరో సానుభూతిపరులతో పేరుతో డబ్బులు నొక్కేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇలా పలు కేంద్రాల్లో రెండు వేల క్వింటాళ్లకు పైనే దోపిడీ చేసినట్లు సమాచారం. క్వింటాకు రూ.2,300 చొప్పున సుమారు రూ.5కోట్లు అన్నదాతకు కుచ్చుటోపీ పెట్టారు.
పదినెలల తర్వాత పావలా వంతు పైసలిచ్చి..
గుర్రంపోడు మండలంలోని తేరటిగూడెం, కొప్పోలు, చామలోని బాయి గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులకు ఇదే పరిస్థితి ఏర్పడింది. జక్కలి నర్సింహ అనే పెద్ద మనిషి గమనించి పది నెలలు పోరాటం చేసి ఆ ఊరు రైతులను జిల్లా సహకార ఆఫీసు దగ్గర కూర్చోబెట్టాడు. ఒక్కో రైతు నుంచి అర క్వింటా నుంచి రెండు క్వింటాళ్ల దాకా సుమారు వంద క్వింటాళ్ల ధాన్యం తడిసిందనే సాకుతో మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు తీశారు. కోత కోసిన తమ ధాన్యం డబ్బులు ఇవ్వకుంటే ఊరుకునేది లేదని చెప్పడంతో సుమారు రూ.25లక్షలకు గానూ బుదవారం రూ.9.20లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా అందరికీ ఒక్కరోజే ఇవ్వమని చెప్పి మొదటగా 20మందికి ఇచ్చి దులుపుకొన్నారు. నష్టపోయిని తాము మాత్రమే బయటకు వచ్చామని, ఇంకా మా గ్రామంలో చాలా మంది ఉన్నారని రైతులు అనడం గమనార్హం.
రెండున్నర క్వింటాళ్లు కోత కోశారు
నేను మా గ్రామం లో నాకున్న భూమిలో అరకొర నీళ్లతో ఎకరం సాగు చేస్తే అందులో 30 బస్తాలు కూడా పండలేదు. దానికే ఎంతో ఇబ్బంది పడా ల్సి వచ్చింది. అయినా నాకు ఆరు బస్తాలు అంటే రెండున్నర క్వింటాళ్లు కోత కోశారు. అదేమని అడిగితే నీ ధాన్యం తడిసిందని చెప్పి అదరకొట్టారు. నా డబ్బులు నాకివ్వాల్సిందే అని పది నెలులుగా తిరిగితే ఇవ్వాల సగం డబ్బులు కూడా ఇవ్వలేదు.
– చీకూరు శ్రీను, తేరటి పల్లి, గుర్రంపోడు మండలం
మా కొనుగోలు కేంద్రం వ్యక్తే ఇదంతా చేశాడు
నేను ఎకరం భూమిలో వరి సాగు చేస్తే 50 బస్తాలు పండింది. అందులో నాలుగు బస్తాలు తరుగు తీశారు. ఇదేందని మా ఊర్ల పెద్ద మనిషి అయిన జక్కలి నర్సింహని కలిస్తే రైతులందరినీ జమచేసి ఆఫీసుల దగ్గరకు తీసుకుపోయిండు. నెలల కొద్ది తిరిగితే ఇయ్యాల చార్జీల ఖర్చులు కూడా రాలేదు. మా సొమ్ము మాకు ఇవ్వడానికి కూడా ఇంత మోసమా. మేము పంట పండించడానికి ఎంత ఇబ్బంది పడ్డామో వాళ్లకేం తెలుసు.
-నారబోయిన యాదయ్య, తేరటిపల్లి, గుర్రంపోడు మండలం