– అందరికీ ఒకే నిబంధనలు వర్తింపజేయాలి
– డీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికుల నిరవదిక సమ్మె
కొండమల్లేపల్లి, ఏప్రిల్ 08 : ఒకే సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఒకే రకమైన సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలని, విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్, ఆన్ మ్యాన్డ్, స్పాట్ బిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి హతిరాంనాయక్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని డీఈ కార్యాలయం ఎదుట నిరవదిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆర్టిజన్ల కన్వర్షనపై ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ష్ట్ర ప్రభుత్వం పేద ఉద్యోగులైన ఆర్టిజన్, ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్, బిల్ కలెక్టర్ల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి నాటి సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క అదిలాబాద్ నుండి ప్రారంభించిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని, ఆన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇచ్చారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లువుతున్నా హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఆర్టిజన్లను రెగ్యూలర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలదేనన్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, ఆన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఏపిఎస్ఈబీ నిబంధనలు అమలు చేయడంతో పాటు గృహజ్యోతి పథకం ద్వారా బిల్లింగ్ కార్మికులను ఆదుకోవాలని, పీస్ రేట్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్లను విద్యార్హత ఆధారంగా రెగ్యూలర్ చేయాలని, కార్మికులందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీఏఈ జేఏసీ జిల్లా జాయింట్ కన్వీనర్ దాసరి యాదయ్య, రమేష్ రెడ్డి, పగిళ్ల యాదయ్య, పతంగి శంకర్, రమావత్ పుల్య, తిరుపతి కుమార్, సర్వర్ హుస్సేన్, జనార్ధన్ గౌడ్ పాల్గొన్నారు.

‘ఆర్టిజన్ కార్మికుల శ్రమ దోపిడి’